జగన్ పై కోర్టు ధిక్కార కేసు

అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి కోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి తదితరులపై కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. అమరావతి నగరాన్ని ఆరు మాసాల్లో నిర్మించాలని, అంతకుముందు రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అందించాలని కోర్టు మార్చి 3వ తేదీన తీర్పిచ్చింది. నిజానికి కోర్టు తీర్పు యధాతధంగా అమలు చేయడం సాధ్యం కాదని అందరికీ తెలిసిందే.

ఇదే విషయమై ప్రభుత్వం కూడా తీర్పు అమలు సాధ్యం కాదని ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ కోర్టు పరిశీలనలో ఉంది. తీర్పు అమలుకు తమకు 60 మాసాలు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తన అఫిడవిట్లో కోరింది. ఈ నేపధ్యంలోనే రాజధాని ప్రాంతానికి చెందిన ఇద్దరు రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు కోర్టులో ధిక్కార పిటీషన్లు వేశారు. ఇందులో వ్యక్తిగతంగా జగన్, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, శ్రీలక్ష్మి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.

గతంలో కోర్టు తీర్పిచ్చినట్లుగా ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో మౌళికసదుపాయాలు ఏర్పాటుచేయకుండా, ప్లాట్లను అభివృద్ధి చేయకుండా, రాజధాని నగరాన్ని నిర్మించకుండా కావాలనే తాత్సారం చేస్తున్నట్లు రైతులు తమ పిటీషన్లో ఆరోపించారు. కోర్టు తీర్పును అమలు చేసే ఉద్దేశ్యంలో ప్రభుత్వం లేదని రైతులిద్దరు ఆరోపించటం ఇక్కడ విచిత్రంగానే ఉంది. ఎందుకంటే కోర్పు తీర్పు అమలు సాధ్యంకాదని స్వయంగా ప్రభుత్వమే చెప్పిన తర్వాత మళ్ళీ అదే విషయాన్ని రైతులు తమ అఫిడవిట్లో ఆరోపించాల్సిన అవసరమే లేదు.

వాస్తవంగా చూస్తే నెల రోజుల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయటం కష్టం. అలాగే మూడునెలల్లో డెవలప్ చేసిన ప్లాట్లను రైతులకు ఇవ్వటం, ఆరు మాసాల్లో రాజధానిని నిర్మించటం జరిగే పని కాదు. అంటే కోర్టు తీర్పు ప్రకారం నెల రోజుల నుండి ఆరు మాసాల్లోగా అన్నీ జరిగిపోవాలంటే మరి నాలుగేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఎందుకు ఇవన్నీ చేయలేకపోయారు ?  ఏదేమైనా కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది కాబట్టి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.