మేం బుర‌ద రాజకీయాలు చేయం.. జ‌గ‌న్‌పై జ‌న‌సేనాని ఫైర్‌

బాధ్యతగల పార్టీగా జనసేన.. రైతులు, కౌలు రైతుల గురించి మాట్లాడుతుంటే జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవడం ఒక బాధ్యతగా తీసుకున్నామని.. జనసేనకు మీ లాగా బురద రాజకీయాలు చేయడం చేతకాదని ఆయన దుయ్యబట్టారు. సాగు నష్టం, రుణభారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.., వారిని ఆదుకోవటంలో   ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు కలిచివేశాయన్నారు.

అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసి దిగ్భ్రాంతి చెందానన్నారు. రైతులకు అండగా నిలవడం తమ బాధ్యత అని అన్నారు. బాధ్యత గల పార్టీగా రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే..వైసీపీ నాయ‌కుల రాజకీయ కోణంలో చూడటం దారుణమన్నారు. తమ పార్టీకి బురద రాజకీయాలు చేయటం చేతకాదని దుయ్యబట్టారు. ఇప్ప‌టికైనా రైతులకు చేయాల్సిన సాయంపై ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే మంచిదని అన్నారు.

“బురద రాజకీయాలు చేయడం మాకు చేతకాదు. రైతులకు అండగా నిలవడం మా బాధ్యత. రైతుల్లో మనోస్థైర్యం నింపేందుకు అధికారులు చొరవ చూపాలి. సాగు నష్టం, రుణభారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారు. రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలం. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రైతుల ఆత్మహత్య కలిచివేసింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి దిగ్భ్రాంతి చెందా. రైతులకు చేయాల్సిన సాయంపై ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే మంచిది.“ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

ఈనెల 23న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏలూరు నుంచి చింతలపూడి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పవన్ పరామర్శించనున్నట్లు వెల్లడించారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే ప‌వ‌న్ కౌలు రైతు భ‌రోసా యాత్ర‌ను ప్రారంభించారు. తొలుత ఆయ‌న అనంత‌పురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప‌లువురు కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి.. రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు.