ఎంపీగా ఇళయరాజా?


సంగీత దర్శకుడిగా అసాధారణ పేరు ప్రఖ్యాతులు సంపాదంచిన ఇళయరాజా.. ఇన్నేళ్లలో ఎప్పుడూ రాజకీయాల జోలికి వెళ్లలేదు. తమిళ నాట గతంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆయన్ని రాజకీయాల్లోకి దించడానికి ప్రయత్నాలు చేశాయి. ఆయన పాపులారిటీని వాడుకుని, పదవులు ఇవ్వజూపాయి. కానీ తనకు సంగీతమే ప్రధానం అని ఆయన పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజ్యసభకు పంపబోతున్నట్లుగా వార్తలు వస్తుండటం విశేషం.

ఇళయరాజా కూడా ఈ దిశగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల మోడీ మీద ఓ పుస్తకంలో ఇళయరాజా ప్రశంసలు కురిపించారు. ‘అంబేద్కర్-మోడీ’ అనే పుస్తకానికి ముందు మాట రాస్తూ అంబేద్కర్ ఆశయాలను మోడీ నెరవేరుస్తున్నారని కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కృతమైన ఈ పుస్తకంలో మోడీ మీద ఇళయరాజా ఇలా ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశం అయింది.

ఇదంతా బీజేపీ-ఇళయరాజా మధ్య కుదిరిన ఒప్పందం మేరకే జరిగిందని.. ఈసారి రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయ్యే 12 మంది రాజ్యసభ సభ్యుల్లో ఇళయరాజా ఒకరు కాబోతున్నారని.. ఈ కోటా కింద ఎంపికై పదవి నుంచి దిగిపోతున్న తమిళ నేత సుబ్రహ్మణ్యస్వామి స్థానంలో ఇళయరాజా ఎగువ సభకు వెళ్లబోతున్నారని చెబుతున్నారు.

తమిళనాట రాజకీయంగా ఎదగడానికి బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. అన్నాడీఎంకే బలహీన పడ్డ నేపథ్యంలో డీఎంకేకు ప్రత్యమ్నాయంగా ప్రజలు తమ వైపే చూడాలని అన్నామలై నేతృత్వంలోని బీజేపీ అక్కడ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇళయరాజాను రాజ్యసభకు పంపి ఆయన అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.