బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ వర్సెస్ సీఎం మమతా బెనర్జీగా పరిస్థితులు మారిపోయాయి. గతేడాది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు గవర్నర్‌పై మమతా పోరు సాగించారనే అభిప్రాయాలున్నాయి.
ఇక ఇప్పుడు తెలంగాణలోనూ పరిస్థితి అలాగే మారింది. సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళి సైని దూరం పెడుతుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా కేసీఆర్ బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన కూడా తమిళనాడు గవర్నర్‌తో దూరం పాటిస్తున్నట్లు తెలిసింది.
నీట్ మినహాయింపు బిల్లు విషయంలో తమిళనాడు గవర్నర్‌కు అక్కడి అధికార డీఎంకే పార్టీకి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు. అంతకంటే ముందు వేరే అంశాల్లో గవర్నర్‌తో సీఎం స్టాలిన్‌కు బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు నీట్ మినహాయింపు బిల్లుతో అవి తీవ్ర రూపం దాల్చాయని విశ్లేషకులు అంటున్నారు. తమిళులు మనోభావాలకు గవర్నర్ విలువ ఇవ్వడం లేదని డీఎంకే ఆరోపిస్తోంది. అందుకే తాజాగా గవర్నర్ రవి ఇచ్చిన తేనీటి విందుకు అధికార డీఎంకే, దాని మిత్రపక్షాలు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది.
గవర్నర్ ఇస్తున్న విందుకు హాజరు కావడం లేదని సీపీఎం, వీసీకే, కాంగ్రెస్, డీఎంకే, మనిదనేయ మక్కళ్ కట్చి తదితర రాజకీయ పార్టీలు అంతకుముందే ప్రకటించాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రితో సహా ఎవరూ పాల్గొనకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో తమిళనాడులోనూ గవర్నర్ వర్సెస్ సీఎం పోరు తీవ్రంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విందుకు కేవలం బీజేపీ దాని మిత్రపక్షం అన్నాడీఎంకే, పీఎంకే ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు.
గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎంగా స్టాలిన్ పాలన అందరి మన్ననలు అందుకుంటోంది. ప్రతిపక్షాలు కూడా తగిన ప్రాధాన్యతనిస్తూ ప్రజలు మెచ్చేలా ఆయన తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో సీఎంకు విభేదాలు మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే గవర్నర్‌ను కేసీఆర్ పూర్తిగా దూరం పెట్టారు. ఆమె బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates