మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఖాయమవ్వగానే కొందరు ఎంఎల్ఏల మద్దతుదారులు గోల మొదలుపెట్టారు. జగ్గయ్యపేట, మాచెర్ల, చోడవరం, శ్రీశైలం ఎంఎల్ఏలు సామినేని ఉదయభాను, కరణం ధర్మశ్రీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి మద్దతుదారులు రచ్చ చేస్తున్నారు. గెలిచిన ఎంఎల్ఏలందరు క్యాబినెట్లో అవకాశం ఆశించటం చాలా సహజం. కానీ ఉన్న పరిమితుల కారణంగా అందరికీ మంత్రులుగా అవకాశం ఇవ్వటం ఎవరివల్లా సాధ్యం కాదు.
అసెంబ్లీ స్ధానాల సంఖ్యలో 15 శాతానికి మించకుండా మంత్రులుండాలి. ఈ లెక్క ప్రకారం చూస్తే 175 అసెంబ్లీ సీట్ల ప్రకారం మంత్రిపదవుల సంఖ్య 25కి దాటకూడదు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచింది 151 మంది ఎంఎల్ఏలు. వీరిలో జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే గెలిచిన 150 మందీ మంత్రులుగా అవకాశం కావాలని కోరుకుంటారు. కానీ జగన్ ఇవ్వగలిగింది 25 మందికి మాత్రమే అయినపుడు మిగిలిన 125 మంది పరిస్థితి ఏమిటి ?
సీనియారిటి ప్రాతిపాదకగా చూసుకున్నా, జగన్ కు అత్యంత సన్నిహితులని అనుకున్నా కనీసం 70 మంది ఎంఎల్ఏలుంటారు. వీళ్ళల్లో 25 మందిని ఎంచుకోవాలంటే కష్టమనే చెప్పాలి. ఎవరిని తీసుకున్నా మిగిలిన వాళ్ళందరిలోను అసంతృప్తి సహజమే. ఇపుడదే వివిధ నియోజకవర్గాల్లో జరుగుతోంది. పైగా అసంతృవ్యక్తం చేస్తున్న ఎంఎల్ఏల్లో ఎక్కువమంది రెడ్డి సామాజికవర్గం వాళ్ళే కావటం గమనార్హం.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీలకు పెద్దపీట వేయాలని జగన్ అనుకున్నారు. ఇందులో భాగంగానే కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజికవర్గాలను కూడా త్యాగంచేశారు. మంత్రివర్గంలో బీసీల ప్రాతినిధ్యం పెంచటం కోసం పై సామాజిక వర్గాలకు కోత పెట్టేశారు. ఆశించింది దక్కకపోతే అలకలు, కోపాలు, అసంతృప్తులు సహజమే. నాలుగు రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి. అప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో కాస్త హడావిడి ఉంటుందంతే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదంతా మామూలే. చంద్రబాబునాయుడుకే ఇలాంటి తలనొప్పులు తప్పలేదు ఇక జగన్ ఎంత ?
Gulte Telugu Telugu Political and Movie News Updates