ఈరోజు ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ క్యాబినెట్-2 లో ఆరుగురిని అదృష్ట వంతులనే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎంఎల్ఏగా గెలిచిన మొదటి సారే మంత్రి పదవి వరించటం అంటే మామూలు విషయంకాదు. వారి జిల్లాల్లో సీనియర్లున్నారు, సామాజికవర్గం ఎంఎల్ఏలు కూడా ఉన్నారు. అయినా మంత్రిపదవులను దక్కించుకున్నారంటే నూరుశాతం సుడి బలంగా ఉండటమే కారణమనే సెటైర్లు పడుతున్నాయి.
గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో మొదటిసారి గెలిచారు. విడదల రజని గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసిన మొదటిసారే గెలిచారు. ఎంఎల్ఏగా గెలిచిన మూడేళ్ళకే అమాత్య పదవి వరించేసింది. అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం నియోజకవర్గం నుండి ఉషశ్రీ చరణ్ మొన్నటి ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసి గెలిచారు. మూడేళ్ళ తర్వాత మంత్రిపదవి వచ్చింది.
సీదిరి అప్పలరాజు కూడా శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో పోటీచేసి గెలిచారు. గెలిచిన ఏడాదిన్నరకే మంత్రిపదవి వరించేసింది. అంటే జగన్ మొదటి క్యాబినెట్లో కూడా మంత్రిగానే ఉన్నారు. ఇఫుడు రెండో క్యాబినెట్లో కూడా కంటిన్యు అవుతున్నారు. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం నుండి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. ఈయన కూడా సీదిరి లాగే ఏడాదిన్నర క్రితమే మంత్రిపదవి నుండి దక్కించుకున్నారు.
అయితే రెండో క్యాబినెట్లో కూడా కంటిన్యుయేషన్ దక్కించుకున్నారు. ఈ ఆరుగురిలో బీసీ, కాపు, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన వారే ఉండటం గమనార్హం. గుంటూరు జిల్లా వేమూరు నుండి 2009, 14 నుండి పోటీచేసి ఓడిపోయిన మేరుగ నాగార్జున 2019లో గెలిచారు. ఇపుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
మొదటి క్యాబినెట్ విషయాన్ని వదిలేస్తే రెండో క్యాబినెట్ కూర్పులో జగన్మోహన్ రెడ్డి కాస్త కష్టపడిన విషయం అర్ధమవుతోంది. ఉన్న మంత్రి పదవులు తక్కువ, ఆశావహులు చాలా ఎక్కువగా ఉండటమే జగన్ కష్టానికి ప్రధాన కారణమైంది. పైగా ఆశావహుల్లో చాలామంది జగన్ కు అత్యంత సన్నిహితులే. కాకపోతే వీరిలో కూడా అత్యధికులు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే కావటంతో నిర్దయగా వాళ్ళందరినీ పక్కన పెట్టకతప్పలేదు. దానివల్లే మాచర్ల, జగ్గయ్యపేట, నెల్లూరు రూరల్, ఒంగోలు లాంటి నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తులు వినబడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates