కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వైసీపీలో తుపాను రేపింది. అంచనాలకు మించిన అసంతృప్తి అధికార పార్టీని.. అధినాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త మంత్రి వర్గ ఏర్పాటు ప్రకటనతో కొంత నిరసనలు చోటు చేసుకుంటాయని భావించినప్పటికీ.. ఈస్థాయిలో నిరసనలు.. ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయన్న అంచనా మాత్రం లేదని చెబుతున్నారు. అదే సమయంలో.. పదవులు పోయిన వారి విషయంలో అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు వివాదంగా మారింది. పదవులు పోయినోళ్లందరికి ఒకేలాంటి ఓదార్పు ఉండాల్సింది పోయి.. కొందరికి అమితమైన ప్రాధాన్యత ఇస్తే.. మరికొందరిని పట్టించుకోని తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర హోం మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన మేకతోటి సుచరిత ఆవేదన అంతా ఇంతా కాదన్నట్లుగా మారింది. పోయిన మంత్రి పదవి ఒక ఎత్తు అయితే.. తన ఆవేదనను చెప్పుకోవటానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి రాలేదని అలిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించిన సజ్జల.. ఎస్సీ మహిళ అయినందుకే మేకతోటి సుచరిత కుటుంబీలు సజ్జలను కలుస్తామని కోరినా.. వారికి సమయం ఇవ్వలేదని మండిపడుతున్నారు.
సుచరితకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవటంతో ఆమె ఫాలోయర్స్ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేపట్టారు. దీనికి ముందు సుచరిత ఇంటి ముందు కూర్చొని సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గుంటూరు లాడ్జి సెంటరు ప్రధాన రహదారిపై టైర్లను తగులబెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి.. సజ్జలతో పాటు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో అలెర్టు అయిన అధినాయకత్వం మధ్యవర్తిత్వం చేయటానికి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను మేకతోటి సుచరిత వద్దకు పంపారు. అయితే.. అక్కడ మోపిదేవిని అడ్డుకున్న కార్యకర్తలుఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమీకరణాల్లో భాగంగానే మంత్రి పదవి దక్కలేదని.. త్వరలోనే సుచరితకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సుచరిత ఇంటికి వెళ్లటానికి మోపిదేవి పోలీసుల బలగాల సాయంతో వెళ్లాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్థమవుతుందని చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మంత్రి పదవి పోయిన వేళ.. సుచరిత కుటుంబీకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మధ్యవర్తిత్వం చేయటానికి వచ్చిన మోపిదేవిని ఉద్దేశించి.. నిష్ఠూరాలు ఆడినట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన సుచరిత కుమార్తె రిషిత.. తన తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని పేర్కొని సంచలనంగా మారారు. నిజంగానే ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారా? చేస్తే.. ఆ కాపీని స్పీకర్ కు పంపారా? అది స్పీకర్ ఫార్మాట్ లోనే ఉందా? అన్నది తేలాల్సిఉంది. చూస్తుండగానే టీ కప్పులోతుపాను అనుకున్న వ్యవహారం అంతకంతకూ సీరియస్ గా మారుతుండటం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates