సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే తమిళ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిపై కేసు నమోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఒక వర్గం మనోభావాలను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేసినందుకు రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అమెరికాలో ఎప్‌స్టీన్ అనే ఒక వ్యాపారవేత్త.. ఒక పార్టీలో భాగంగా తన అతిథుల కోసం చిన్న వయసు అమ్మాయిలను ఏర్పాటు చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీని మీద అమెరికాలో పెద్ద దుమారం రేగింది. ఎప్‌స్టీన్ గురించి సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టుపై చిన్మయి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
ఎప్‌స్టీన్ గనుక ఇండియాలో పుట్టుండి అతను దేవుడి పాటలు పాడడం, భజనలు చేయడం లాంటివి చేసి ఉంటే.. అతను ఇక్కడ బాబాజీ అయ్యేవాడని, అతణ్ని జనాలు నెత్తిన పెట్టుకునేవారని వ్యాఖ్యానించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రతిదాన్నీ హిందూ మతానికి ముడిపెట్టి వివాదం రాజేయడం, హిందువులను రెచ్చగొట్టడం చిన్మయికి అలవాటైపోయిందంటూ ఆమె మీద నెటిజన్లు మండిపడుతున్నారు.
ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆమెపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆమె పాత వ్యాఖ్యల మీద కూడా చర్చ జరుగుతోంది. పెళ్లయిన మహిళలు మంగళసూత్రం ధరించే విషయమై కొన్ని నెలల కిందట చిన్మయి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి.
ఆమెకు మద్దతుగా మాట్లాడిన తన భర్త రాహుల్ రవీంద్రన్ సైతం విమర్శలు ఎదుర్కొన్నాడు. చిన్మయి ఎంతసేపూ హిందూ మతంలో పద్ధతులు, సంస్కృతికి సంబంధిన విషయాలనే తప్పుబట్టడం.. మిగతా మతాల జోలికి వెళ్లకపోవడం.. పదే పదే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం పట్ల ఆమెను తీవ్రంగా తప్పుబడుతున్న వ్యక్తులు ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates