వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ప్రజలు ఛీత్కరించిన విషయంతెలిసిందే. దీంతో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పరిమితం అయింది. ఇలా ఎందుకు జరిగింది? అనేది సుస్పష్టం.
నాయకులు వ్యవహరించిన తీరు, దుర్భాషలు, అప్పటి విపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్యలు.. ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, న్యూడ్ వీడియోలు, శవాల డోర్ డెలివరీ, ప్రశ్నిస్తే.. కేసులు ఇలా.. ప్రజలకు ఒక నరకం కనిపించింది. దీంతో ప్రజలు మార్పు కోరుకున్నారు.
వైసీపీని దాదాపు బుట్ట దాఖలు చేశారు. ఇలాంటి సమయంలో పార్టీ వాస్తవాలు తెలుసుకుని ప్రజల నాడి ప్రకారం మారాల్సిన అవసరం ఉంది. కానీ, ఈ తరహా మార్పు ఇటు పార్టీ నాయకుల్లోనూ అటు పార్టీ అధినేతలోనూ కనిపించడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికీ వైసీపీ నాయకులు బెదిరింపుల రాజకీయాలే చేస్తున్నారు.
చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై దారుణమైన వ్యాఖ్యలతో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, పేర్ని నాని విరుచుకుపడుతున్న తీరు తెలిసింది. అయితే.. వీటిపై దృష్టి పెట్టి మార్పు దిశగా నాయకులను నడిపించాల్సిన జగన్.. దానిని వదిలేసి.. మరోసారి వారికే మద్దతుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా గుంటూరులో పర్యటించిన జగన్.. అంబటి కుటుంబాన్ని ఓదార్చారు. సీఎం చంద్రబాబుపై చేసిన దుర్భాషల నేపథ్యంలో అంబటిని పోలీసులు అరెస్టుచేయడం.. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పర్యటించారు. అయితే.. జగన్‌తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు.
మళ్లీ ఆయన బెదిరింపుల ధోరణినే ప్రదర్శించారు. తాము అధికారంలోకి వస్తే.. వడ్డీతో సహా చెల్లిస్తామని.. చంద్రబాబును మంత్రి నారా లోకేష్‌ను హెచ్చరించారు. అంతేకాదు.. ప్రస్తుతం జరుగుతున్న ప్రతి విషయాన్నీ రాసి పెట్టుకుంటున్నట్టు హెచ్చరించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని.. తాము వచ్చాక అన్నింటిపైనా విచారణ చేస్తామని.. అప్పుడు ఎక్కడుంటారో చూస్తామని బెదిరింపు ధోరణినే ప్రదర్శించారు.
అయితే.. ప్రస్తుతం జగన్ నుంచి ప్రజలు ఇలాంటి బెదిరింపులను కోరుకోవడం లేదు. భారీ మార్పును ఆశిస్తున్నారు. అంతెందుకు.. వైసీపీ నాయకుల్లోనే మెజారిటీ నేతలు.. జగన్ వైఖరి మారాలని పదే పదే చెబుతున్నారు.
బెదిరింపులు, హెచ్చరికలు .. రప్పా-రప్పా అనేవారికి సమర్థనలు, గంజాయి బ్యాచ్‌కు పరామర్శలు వంటివి సొంత పార్టీ నేతలనే ఇరుకున పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్పు దిశగా అడుగులు వేయాలని తరచుగా చాలా మంది నాయకులు జగన్‌కు చెబుతున్నారు. అయినా.. ఆయనలో ఎలాంటి మార్పు రాకపోగా.. మరింత బెదిరింపు ధోరణిలోనే వ్యవహరిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates