ఈ మధ్య కాలంలో థియేటర్లలో సుదీర్ఘ కాలం ఆడిన సినిమా.. ‘దురంధర్’. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ 50 రోజుల తర్వాత కూడా ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఐతే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 8 వారాల థియేట్రికల్ విండో తర్వాత ‘దురంధర్’ను నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్‌గా రిలీజ్ చేశారు. ఇక్కడా సినిమా అదరగొడుతోంది.
ఇండియానే కాక అనేక దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. చివరికి పాకిస్థాన్‌లో సైతం ఇదే నంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా మీద ఎంత పెట్టుబడి పెట్టిందో కానీ.. రిటర్న్స్ అంతకుమించే ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ ‘దురంధర్’కు కొనసాగింపుగా రాబోతున్న ‘దురంధర్-2’ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోవట్లేదు. దర్శక నిర్మాత ఆదిత్య ధర్.. డిజిటల్ డీల్‌లో మార్పు చేశాడు. సీక్వెల్ హక్కులను జియో హాట్ స్టార్‌కే అప్పగించాడు.
‘దురంధర్’ డిజిటల్ వెర్షన్ క్వాలిటీ విషయంలో నెట్‌ఫ్లిక్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఒరిజినల్ క్వాలిటీని తగ్గించేసి విజువల్స్, సౌండ్‌ను తగ్గించేసిందంటూ ఆ సంస్థపై నెటిజన్లు మండిపడ్డారు. థియేటర్లలో విజువల్స్, నెట్‌ఫ్లిక్స్ విజువల్స్ మధ్య తేడాలు చూపిస్తూ ఎన్నో పోస్టులు వచ్చాయి సోషల్ మీడియాలోకి. ‘దురంధర్-2’ చేతులు మారడానికి ఇది ఒక కారణం కావచ్చు.
నిజానికి ‘దురంధర్’లో జియో సంస్థ కూడా నిర్మాణ భాగస్వామే. ఆ సంస్థలో తెరకెక్కిన చిత్రాలను చాలా వరకు జియో హాట్ స్టార్‌లోనే రిలీజ్ చేస్తుంటారు. కానీ నెట్‌ఫ్లిక్స్ ఫాన్సీ ప్రైస్ ఇచ్చిందో ఏమో.. ‘దురంధర్’ డిజిటల్ రైట్స్ ఆ సంస్థకు కట్టబెట్టారు.
కానీ ‘దురంధర్’ డిజిటల్ క్వాలిటీ విషయంలో విమర్శలు రావడం, దీనికి తోడు ‘దురందర్-2’కు బంపర్ క్రేజ్ ఉండడంతో ఈసారి తామే ఆ ప్రయోజనం పొందుతామని జియో వాళ్లు ఫిక్సయి ఉండొచ్చు. మార్చి 19న దురంధర్ రిలీజ్ కానుండగా.. ఇంకో రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలో రిలీజవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates