ఊహించని రీతిలో కేసీయార్ గాలిని గవర్నర్ తమిళిసై తీసేశారు. అది కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కలిసివచ్చిన తర్వాత. గవర్నర్ కోటాలో ఎవరిని ఎంఎల్సీగా నామినేట్ చేయాలన్నది పూర్తిగా తన విచక్షణపైన ఆధారపడుందని కుండబద్దలు కొట్టకుండానే ప్రకటించారు. దాంతో కేసీయారు గాలిని గవర్నర్ తీసేసినట్లయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆ మధ్య గవర్నర్ కోటాలో ఎంఎల్సీ నియామకం విషయంలో కౌశిక్ రెడ్డి పేరును కేసీయార్ సిఫారసు చేశారు.
అయితే ఆ ఫైలుపై సంతకం చేయకుండా నెలల తరబడి గవర్నర్ తన దగ్గరే పెట్టుకుని కూర్చున్నారు. ఇప్పటికీ ఆ ఫైలు గవర్నర్ దగ్గరే పెండింగ్ లో ఉంది. నిజానికి గవర్నర్ కోటాలో ఎవరిని సిఫారసు చేయాలనేది కేసీయార్ ఇష్టం. మామూలుగా అయితే ప్రభుత్వం నుండి వచ్చే సిఫారసులను గవర్నర్ పెద్దగా అభ్యంతరాలు పెట్టకుండానే ఆమోదించేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అధికారాల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుంటే గొడవలవుతాయని.
ఇందులో భాగంగానే కౌశిక్ పేరును కేసీయార్ సిఫారసు చేశారు. ఎంతకాలమైనా గవర్నర్ ఆమోదం లభించలేదు. దాంతో కౌశిక్ ను కేసీయార్ ఎంఎల్ఏల కోటాలో ఎంఎల్సీగా ఎంపిక చేయించి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. దాంతో అక్కడితో విషయానికి తెరపడిందనే అంతా అనుకున్నారు. అయితే ఢిల్లీలో మీడియా గవర్నర్ మాట్లాడుతూ కేసీయార్ సిఫారసు చేసిన కౌశిక్ పేరును కావాలనే అడ్డుకున్నట్లు చెప్పటం సంచలనంగా మారింది.
గవర్నర్ కోటాలో ఎవరిని ఎంఎల్సీలను చేయాలనేది పూర్తిగా తన విచక్షణాధికారమని గవర్నర్ ప్రకటించారు. కౌశిక్ చేసిన సమాజ సేవ ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. కౌశిక్ సిఫారసు విషయంలో తాను సంతృప్తి చెందలేదు కాబట్టే ఆమోదం చెప్పలేదని కూడా అన్నారు. దాంతో కేసీయార్ తో పాటు అధికార పార్టీకి మండుతోంది. మరి ఎప్పుడో ముగిసిపోయింది అనుకున్న వివాదం మళ్ళీ రేగటంతో తాజా వివాదం మళ్ళీ ఎక్కడకు దారితీస్తందో అర్ధం కావటంలేదు.