అప్పుడప్పుడూ మరక మంచిదే! అప్పుడప్పుడూ మార్పు కూడా మంచిదే ! ఆ కోవలో ఆ తోవలో మంత్రి పేర్ని నాని ఉన్నారు.తన తప్పు ఏమయినా ఉంటే మనఃస్ఫూర్తిగా క్షమించండి అని వేడుకోవడం ఇవాళ్టి పరిణామంలో కొసమెరుపు. ఆ వివరం ఈ కథనంలో…! త్వరలో మంత్రి వర్గ విస్తరణ కానుంది. అందుకు ముహూర్తం కూడా నిర్థారణ అయింది. ఈ సమయంలో ఒక్కో మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలకు, అస్సలు పొంతన లేని జవాబులకు, బూతులకు చిరునామాగా నిలిచిన మంత్రులంతా ఇప్పుడు పునరాలోచనలో పడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ మూడేళ్ల కాలాన్ని పునః సమీక్ష చేసుకుంటున్నారు. మంత్రిగా తొలిసారి అవకాశం దక్కిన పేర్ని నాని అయితే ఇంకా పునరాలోచనలో పడిపోయారు కూడా !
రేపటి నుంచి తన నడవడి సంబంధిత ప్రణాళిక ఏంటన్నది కూడా ఓ విధంగా అయోమయంలో ఉంది. ఏం చేస్తే రాజకీయంగా ఎదిగి వస్తాను అన్న ఆలోచన కూడా ఆయనకు అందడం లేదు. రవాణా శాఖతో పాటు సమాచార శాఖను కూడా నిర్వహించారు. యువ ముఖ్యమంత్రి విశ్వసించిన వారిలో వీర విధేయుడిగా ఉన్నారు. ఓ విధంగా బాహుబలి క్యాబినెట్ లో కట్టప్ప ఎవరంటే మొదటి వరుసలో నిల్చొంటారు నాని. ఆ తరువాతే ఆళ్ల నాని కానీ కొడాలి నాని కానీ! అంతటి ప్రేమ మరియు విశ్వాసాన్నీ ప్రకటించారాయన.
తనకు అప్పగించిన పనులతో పాటు కొన్ని అదనపు బాధ్యతలు కూడా నెత్తిన వేసుకున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఆఖరు నిమిషంలో బాధ్యతలు అందుకోమన్నా అందుకున్ని భీమ్లా నాయక్ సమయంలో వివాదాస్పద జీఓ అమలుకు ఎంతో కృషి చేశారాయన. ఆ సమయంలో పవన్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు కూడా ! అయినా సరే జగన్ ఆదేశాలను తు.చ.తప్పక పాటించిన ఏకైక మంత్రిగా పేరుంది. తాజాగా ఆయన పదవీచ్యితుడు కానున్నారు.
ఈ నెల 11 న కొత్త మంత్రివర్గంలో పాతవారెవ్వరూ దాదాపుగా ఉండరు. బొత్స బెర్త్ కూడా డౌటే ! ఒకవేళ పాతవాళ్లు ఉన్నా కూడా కొత్తవాడయిన పేర్ని నానికి మాత్రం ఉద్వాసన తప్పదు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రయివేట్ బస్ ఆపరేటర్స్ తో ఆయన సమావేశం అయ్యారు.తాను పదవిలో ఉన్నా లేకపోయినా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి, ఆఖరులో తాను ఏమయినా ఎక్కువ, తక్కువ లు మాట్లాడితే క్షమించమని అడిగారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates