దేశంలో జాతీయపార్టీలకు విరాళాల వరద ఉప్పొంగింది. వ్యాపార సంస్థలు, కార్పొరేట్ల నుంచి 2019-20 ఏడాదికి రూ.921.95 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి అత్యధికంగా రూ.720.407 కోట్ల విరాళాలు అందడం ఇప్పుడు చర్చకు దారితీసింది. కొన్నాళ్లుగా మోడీ.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు వున్నాయి. అయితే.. తాము పేదల కోసం.. ఈ దేశం కోసం పనిచేస్తున్నామని… బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ.. తాజాగా అందిన విరాళాలను బట్టి.. మోడీ ఎవరి కోసం పనిచేస్తున్నారో.. తెలిసిపోయిందని.. జాతీయ పార్టీల నేతలు దుయ్యబడుతున్నారు.
జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు గణనీయంగా పెరిగాయి. వ్యాపార సంస్థలు, కార్పొరేట్ల నుంచి 2019-20 ఏడాదికి రూ.921.95 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో బీజేపీకి అత్యధికంగా రూ.720.407 కోట్ల విరాళాలు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. 2017-18 నుంచి 2018-19 ఏడాదికి కార్పొరేట్ల విరాళాలు 109 శాతానికి పెరిగాయని పేర్కొంది.
2019-20 ఏడాదికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలు రూ.133.04కోట్లు, ఎన్సీపీకి రూ.57.086 కోట్లుగా ఉన్నాయి. కాగా.. సీపీఎంకు ఎలాంటి కార్పొరేట్ ఫండ్స్ రాలేదని ఏడీఆర్ వెల్లడించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన దాతల గురించి భారత ఎన్నికల కమిషన్‌కు జాతీయ పార్టీలు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఏడీఆర్ తెలిపింది. ఇందులో ప్రధానంగా ఐదు జాతీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, సీపీఎంలు ఉన్నాయి.
5 జాతీయ పార్టీల్లో బీజేపీ 2,025 కార్పొరేట్ దాతల నుంచి రూ.720.40 కోట్ల విరాళాలు పొందింది. కాంగ్రెస్ 154 కార్పొరేట్ దాతల నుంచి రూ.133.04 కోట్లు, ఎన్సీపీ 36 కార్పొరేట్ దాతల నుంచి రూ.57.08 కోట్ల విరాళాలు అందుకున్నాయి. కార్పొరేట్ విరాళాల ద్వారా ఎలాంటి ఆదాయం సమకూరలేదని సీపీఎం ప్రకటించింది. అయితే.. ఈ వివరాలపై కాంగ్రెస్ నేతలు.. సహా ఇతర పార్టీల నేతలు.. మౌనంగా ఉన్నారు. కానీ, బీజేపీపై మాత్రం విమర్శలు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని కామెంట్లు వస్తున్నాయి.