తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కాకపోతే ఆ రాజకీయానికి ఉగాది పండుగ వేదిక అవుతుండటమే బాధాకరం. ఇంతకీ విషయం ఏమిటంటే రాజ్ భవన్లో శుక్రవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగబోతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి కేసీయార్ తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు, వివిధ రంగాల్లో ప్రముఖులను కూడా గవర్నర్ పిలిచారు.
ఉగాది వేడుకలు నిర్వహించడం, అందుకు ప్రముఖలకు ఆహ్వానాలు పంపటం మామూలుగా జరిగేదే. కాకపోతే ఈసారి కీలకం ఏమిటంటే గవర్నర్-కేసీయార్ మధ్య మాటల్లేవు. కేసీయార్ రాజ్ భవన్ గడప తొక్కి చాలా కాలమైంది. గవర్నర్ పాల్గొంటున్న కార్యక్రమాల్లో కేసీయార్ కనిపించటంలేదు. పైగా చాలా సందర్భాల్లో గవర్నర్ విషయంలో ప్రోటోకాల్ కూడా పాటించటం లేదు. దీంతో గవర్నర్ కు కూడా మండింది.
చివరగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని కూడా కేసీయార్ లేకుండానే నడిపేశారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు బాగా పెరిగిపోయాయి. అయితే ఉగాది పండుగను అడ్డం పెట్టుకుని గవర్నర్ అనూహ్యంగా కేసీయార్ ను రాజ్ భవన్ కు ఆహ్వానించారు. మరిపుడు కేసీయార్ ఆ వేడుకలకు వెళతారా ? వెళ్ళరా ? అనేది పెద్ద విషయమైపోయింది. గవర్నర్ పంపిన ఆహ్వానంతోనే ఉగాది రాజకీయం ఊపందుకుంది.
నిజానికి కేసీయార్ విషయంలో గవర్నర్ ప్రత్యేకంగా చేసిందంటు ఏమీ లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య మోడీ హైదరాబాద్ వచ్చినపుడు కూడా కేసీయార్ ఎక్కడా కనబడలేదు. అయితే దాని తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో గవర్నర్ ను కేసీయార్ దూరంగా పెట్టేస్తున్నారు. గవర్నర్ కు ప్రోటోకాల్ పాటించకపోవడం కూడా ఇందులో భాగమే. విభేదాలు తగ్గించుకునేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నట్లే ఉన్నారు. మరి కేసీయార్ ఏమి చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates