గుడ్ మార్నింగ్‌.. గుడ్ న్యూస్ చెప్పేనా?

పొద్దున లేవ‌గానే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌.. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం.. అక్క‌డే అధికారుల‌తో మాట్లాడ‌డం.. ఇలా సామాజిక మాధ్య‌మాల్లో వీడియోల‌తో ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి పాపుల‌ర్‌గా మారారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయ‌న పేరు సంపాదించారు. త‌న మార్నింగ్ వాక్‌తో ఆయ‌న పేరు ప్ర‌జ‌ల్లో నానుతోంది. ఇప్పుడా మార్నింగ్ వాక్ కార్య‌క్ర‌మ‌మే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి తెచ్చి పెట్టేలా ఉంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యేగా ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌పై మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. జ‌గ‌న్‌కు విధేయుడిగా ప్ర‌జ‌ల‌తో క‌లిసి సాగుతున్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో గుడ్ మార్నింగ్ ధ‌ర్మ‌వ‌రం పేరుతో కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి  చేప‌డుతున్న కార్య‌క్ర‌మం ఆయ‌నకు మంచి పేరు తెచ్చిపెడుతోంది. త‌న నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో పాటు ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆయ‌న పేరు తెగ విన‌ప‌డుతోంది. ఆ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన ఆయ‌న వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఏదో ఒక వార్డు లేదా ఒక పంచాయ‌తీలో ప‌ర్య‌టించే కార్య‌క్ర‌మానికి ఆయ‌న ఇలా తెర‌తీశారు. 2019లో రెండోసారి ధ‌ర్మ‌వ‌రంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న మూడేళ్ల వ్య‌వ‌ధిలో నియోజ‌వ‌ర్గంలోని మెజారిటీ ప్రాంతాన్ని ఇలా క‌వ‌ర్ చేశారు. ఇంకా కొన‌సాగిస్తూనే ఉన్నారు.

స‌మ‌స్య‌ల‌పై ఎమ్మెల్యేను ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నా వాళ్ల‌కు అప్ప‌టిక‌ప్పుడే స‌మాధానాలు చెబుతూ ఎమ్మెల్యే సాగుతున్నారు. ప్ర‌జ‌లు నిల‌దీసే అవ‌కాశం ఉంద‌ని తెలిసినా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఈ మార్నింగ్ వాక్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కేలా చేస్తుంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో సీఎం జ‌గ‌న్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. ముగ్గురు లేదా న‌లుగురు మంత్రుల‌ను మిన‌హాయించి పూర్తిగా కొత్త‌వాళ్ల‌కు ఆయ‌న కేబినేట్‌లో ఛాన్స్ ఇస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రెండు ద‌శాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కేతిరెడ్డికి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆయ‌న అనుచ‌రులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వ‌డం కేతిరెడ్డికి లాభించే అంశం. అయితే సామాజిక స‌మీక‌ర‌ణాలు, జిల్లాలో ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు.. ఇలా కేతిరెడ్డికి కొన్ని అడ్డంకులు కూడా క‌నిపిస్తున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తారో లేదో కొన్నాళ్లూ వేచి చూస్తే తెలిసిపోతుంది.