జగన్‌కు విజయమ్మ షాక్.. నిజమేనా?

వైఎస్ కుటుంబంలో రాజకీయ చిచ్చు చాన్నాళ్ల నుంచి చర్చనీయాంశంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల కారణంగా జైలు పాలైనపుడు.. ఆయన కోసం రోడ్డు మీదికి వచ్చి సుదీర్ఘ కాలం, దూరం పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గకుండా చేసిన సోదరి షర్మిళ.. చివరికి తన అన్న తనకు ఏ విధమైన న్యాయం, సాయం చేయకపోవడంతో ఆగ్రహించి తెలంగాణలో కొత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ పెట్టడం తెలిసిందే.

అప్పట్నుంచి అన్నాచెల్లెల్ల విభేదాలపై చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా షర్మిళ భర్త అనిల్ కుమార్ ఆంధ్రాలో పార్టీ పెట్టే సన్నాహాల్లో ఉన్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశం అయింది. చెల్లే కాక తల్లి సైతం జగన్‌ పట్ల అసంతృప్తితో ఉన్నారని.. కొడుక్కి ఆమె కూడా దూరం కాబోతున్నారని ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది.వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ.. తన పదవికి రాజీనామా చేసి కొడుక్కి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ మేరకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. తన కొత్త పలుకు ఆర్టికల్లో రాసిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. జగన్ అంటే పడని రాధాకృష్ణ ఏదో నోటికొచ్చినట్లు రాసేశాడని దీన్ని కొట్టి పారేయడానికి కూడా లేదు. ఇంతకుముందు షర్మిల పార్టీ పెడుతోందని వెల్లడించింది ఆయనే. అప్పుడు చాలామంది లైట్ తీసుకున్నారు. నవ్వుకున్నారు. కానీ చివరికి ఆర్కే చెప్పిందే నిజమైంది. ఆ తర్వాత కూడా వైఎస్ కుటుంబంలో తెర వెనుక విషయాలు చాలా వాటి గురించి ఆయన తన ‘కొత్త పలుకు’లో రాస్తూనే ఉన్నారు.

అవి చాలా వరకు నిజమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు విజయమ్మ కొడుకుతో విభేదించి వైకాపా గౌరవాధ్యక్షురాలి పదవికి గుడ్ బై చెబితే ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. ఈ మాటే జగన్‌కు చెబితే.. వైకాపా వ్యవస్థాపక దినోత్సవం వరకు ఆగాలని చెప్పారట. ఏదేమైనప్పటికీ ఆర్కే చెప్పినట్లు విజయమ్మ కొడుకు పార్టీకి టాటా చెబితే మాత్రం చెల్లికి, తల్లికి అన్యాయం చేసిన జగన్ అంటూ ఆయన మనస్తత్వం గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకోవడం గ్యారెంటీ.