మంత్రివర్గం పోరు.. రోజాకు అవకాశముందా ?

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆలస్యమయ్యే కొద్దీ మార్పులు, చేర్పులపై మీడియాలో ఊహాగానాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే నగిరి ఎంఎల్ఏ రోజాకు అవకాశం ఖాయమంటూ ప్రచారం పెరిగిపోతోంది. నిజానికి 2019లోనే రోజా మంత్రవుతారంటు చాలామంది అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల అవకాశం దక్కలేదు. దాంతో క్యాబినెట్ ర్యాంకుండే ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారు.

అయితే ఆ పదవి టర్మ్ కూడా అయిపోయింది. ఇంతకాలానికి మళ్ళీ మంత్రివర్గం వ్యవహారం తెరమీదకు వచ్చింది. మామూలుగా అయితే ఇఫుడు కూడా రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం లో ఎక్కువమందిని ఎకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో రోజాను తీసుకోవటం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కావడం లేదు. పైగా చిత్తూరు జిల్లా నుండి ఇద్దరు రెడ్లు అందులోను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా రోజాకు మంత్రి పదవి అసలు సాధ్యం కాదు.

అయితే తాజా సమీకరణల్లో పెద్దిరెడ్డిని కూడా మంత్రివర్గం నుండి తప్పించబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే రోజాకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. మంత్రివర్గంలోకి తీసుకుని రోజా దూకుడుకు జగన్ కాస్త పగ్గాలు వేస్తే పార్టీ+ప్రభుత్వ ఇమేజి పెరుగుతుంది. ఇదే సమయంలో చాలామంది మంత్రులను ఈ ఫైర్ బ్రాండ్ పూర్తిగా డామినేట్ చేయటం ఖాయం. అందుకనే కాస్త స్పీడు బ్రేకర్లను జగన్ రెడీ చేసుకోవాలి.

పెద్దిరెడ్డిని పార్టీ బలోపేతానికి, జిల్లాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలను సర్దుబాటు చేయటం కోసం జగన్ ఉపయోగించనున్నట్లు సమాచారం. గతంలోనే కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాలకు పెద్దిరెడ్డి ఇన్చార్జిగా పనిచేసున్నారు. దాదాపు 40-50 మంది ఎంఎల్ఏలతో 10 మంది ఎంపీలతో వ్యక్తిగతంగా గట్టి సంబందాలున్నాయి. కాబట్టే పెద్దిరెడ్డి కెపాసిటినీ పార్టీ కోసం ఉపయోగించుకోవాలని జగన్ డిసైడ్ చేశారట. ఈ సమీకరణలోనే రోజా పేరు బాగా ప్రచారంలోకి వచ్చేసింది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.