మ‌హిళా ఎమ్మెల్సీకి మంత్రి ప‌ద‌వి..?

రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. పార్టీలో అధినేత‌ను న‌మ్మితే.. నాయ‌కుల‌కు మేలు జ‌ర‌గ‌కుండా పోదు. ఇప్పుడు ఇదే మాట‌.. వైసీపీలో జోరుగా వినిపిస్తోంది. టీడీపీలో ఉండ‌గా.. ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకున్న బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళా నాయ‌కురాలు .. పోతుల సునీత‌. అంతేకాదు.. 2014 ఎన్నిక‌ల్లో చీరాల నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి.. అప్ప‌ట్లో తీవ్ర యుద్ధం చేసి.. రాజ‌కీయంగా పెద్ద ఎత్తున ఆమె వార్త‌ల్లోకి ఎక్కారు. త‌ర్వాత‌.. పార్టీకి అండ‌గా ఉన్నారు. పార్టీ త‌ర‌ఫున ఈ క్ర‌మంలోనేఆమెకు చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చారు. ఇటు, బ‌య‌టా.. అటు ఇంటా.. అన్న‌ట్టుగా గ‌ట్టి వాయిస్ వినిపించే నాయ‌కురాలిగా సునీత పేరు తెచ్చుకున్నారు.

త‌ర్వాత‌.. జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో చీరాల‌ను చంద్ర‌బాబు ఆమెకు ఇవ్వ‌కుండా.. క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తికి ఇచ్చారు. దీంతో తీవ్ర అస‌హ‌నానికి గురైన సునీత‌.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే.. టీడీపీ కి గుడ్‌బై చెప్పి.. వైసీపీలోకి చేరారు. అంతేకాదు.. త‌న ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. బీసీ సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న నాయ‌కురాలు.. అత్యంత విశ్వ‌స‌నీయ వ్య‌క్తి అని పేరుండ‌డంతో జ‌గ‌న్ కూడా ఆమెకు వెంట‌నే.. కోల్పోయిన‌.. ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి ఇచ్చారు.

ఇక‌… అప్ప‌టి నుంచి వైసీపీ త‌ర‌ఫున సునీత గ‌ట్టివాయిస్ వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల మండ‌లిలో టీడీపీ నేత‌లు చేసిన తీవ్ర దుమారాన్ని అడ్డుకోవ‌డంతోపాటు.. వారి నిర‌స‌న‌పైనా.. సునీత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇలా.. వైసీపీ అధినేత దృష్టిని బాగానే ఆమె ఆక‌ర్షించారు. ఈ క్ర‌మంలోనే ఆమెను మ‌రింత ప్రోత్స‌హించాల‌ని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నారు. వైసీపీకి బీసీ పురుష నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. బీసీ మ‌హిళా నాయ‌కుల సంఖ్య త‌క్కువ‌గా ఉంది.

పైగా సునీత మాదిరిగా ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు బీసీ వ‌ర్గాల్లో లేర‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలొ బీసీ సామాజిక‌వ ర్గంలో సునీత‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా ఆ వ‌ర్గాన్ని వైసీపీ వైపు మ‌రింత‌గా ఆక‌ర్షించే అవ‌కాశం ఉంటుంద‌ని.. జ‌గ‌న్ బావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె పేరును మంత్రి వ‌ర్గ నియామ‌కం కోసం నియ‌మించిన స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిలు ప‌రిశీలిస్తున్న‌ట్టు .. వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. సునీత‌కు క‌నుక మంత్రి ప‌ద‌వి ఇస్తే.. ఒక సంచ‌ల‌న‌మే అంటున్నాయి.