రాజధాని.. ఈ రెండు ఆప్ష‌న్ల దిశ‌గా.. జ‌గ‌న్ మేధోమ‌థ‌నం?

వ్యూహం మారుతోంది.. వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహాన్ని మార్చుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇదే విష‌యంపై తాడేప‌ల్లి వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతోంది. ప్ర‌స్తుతం అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల కే తాముక‌ట్టుబ‌డి ఉన్నామ‌ని.. ప‌రోక్షంగా ప్ర‌త్య‌క్షంగా కూడా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. వికేంద్రీక‌ర‌ణ విష‌యం లో తాము వెన‌క్కి  త‌గ్గేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంటే మూడు రాజ‌ధానుల‌కే ఆయ‌న క‌ట్టుబడి ఉన్నా న‌నేది .. సుస్ప‌ష్టం చేశారు. కానీ, దీనిని అమ‌రావ‌తి రైతులు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నారు.

పైగా కోర్టుల నుంచి కూడా అమరావ‌తికే అనుకూలంగా తీర్పులు వ‌చ్చాయి. ఈనేప‌థ్యంలో జ‌గ‌న్ ఇప్పుడు ఏం చేయాలి?  ఏంచేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలో ఆయ‌న న్యాయ‌స‌ల‌హా తీసుకుని.. ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఈ స‌మ‌యంలోనే.. విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల‌నే.. రాజ‌ధానులుగా.. అంటే జంట న‌గ‌రాలుగా మార్చే వ్యూహంపై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఈ విష‌యంపైనా.. ఆయ‌న చూచాయ‌గా.. అసెంబ్లీలో హింట్ ఇచ్చారు.

అమరావ‌తి అయితే.. విజ‌యవాడ‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని.. అదేవిధంగా గుంటూరుకు కూడా 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని చెప్పుకొచ్చారు. సో.. అలా కాకుండా..ఈ రెండు రాజ‌ధానుల్లో ఒక‌దానిని ఎంపికచేసుకుని పాల‌నా ప‌ర‌మైన రాజ‌ధానిని ఏర్పాటు చేస్తే.. అమ‌రావ‌తి నుంచి కూడా విమ‌ర్శ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని.. వైసీపీ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది. అంతేకాదు.. విజ‌య‌వాడ‌, గుంటూరుల‌ను రాజ‌ధానులుగా ప్ర‌క‌టిస్తే.. ఇత‌ర ప్రాంతాల వారికి కూడా ర‌వాణా సౌక‌ర్యంతోపాటు.. ఎలాంటి ఇబ్బందులు రావని అంచ‌నా వేస్తున్నారట‌.

దీనికి పాల‌క‌పార్టీలోని మెజారిటీ నాయ‌కులు కూడా ఓకే చెప్పిన‌ట్టు చెబుతున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖ ను పాల‌నారాజ‌ధానిగా ప్ర‌క‌టించే ప్ర‌య‌త్నం చేశారు. ఈక్ర‌మంలోనే సినీ ఇండ‌స్ట్రీని కూడా విశాఖ కు రావాల‌ని ఆహ్వానించారు. అయితే.. ఇంత‌లో.. న్యాయ‌స్థానం న‌నుంచితీర్పు.. అమ‌రావ‌తి రైతుల నుంచి వ‌స్తున్న నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఈ ప్ర‌య‌త్నం మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో.. విజ‌య‌వాడ‌, లేదా గుంటూరు న‌గ‌రాల్లో ఒక‌దానిని ఎంపిక చేసుకుంటే.. అటు అమ‌రావ‌తిపై త‌న పంతం నెగ్గించుకున్న‌ట్టు ఉంటుంది.. ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి విమ‌ర్శ‌లు రాకుండా కూడా ఉంటుంద‌ని.. వైసీపీ నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.