త్వరలో సీపీఎస్ రద్దు నిర్ణయం ఉంటూనే, అందరికీ ఆమోదయోగ్యం అయిన రీతిలోనే సంబంధిత నిర్ణయాలు కూడా వెలువరిస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన అంటున్నారు. ఇప్పటికే దీనిపై పలు మార్లు సీఎంతో చర్చలు జరిపామని, త్వరలో ఉద్యోగులు శుభవార్త వింటారని చెబుతున్నారు. ఈ దశలో సీపీఎస్ ఉద్యోగులు సైతం తమ వంతు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. సర్కారు నిర్ణయాలు కొన్నింటిని తెలుసుకుని వాటిని మార్చేందుకు తమదైన దారిలో మంత్రులతో సీఎంకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ దశలో ఏప్రిల్ నాలుగు నుంచి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి. వీటిపై ముఖ్యమంత్రి స్పష్టమయిన ఆదేశాలు కూడా ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మొదలుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరకూ సీపీఎస్ రద్దుపై ఎన్నో సార్లు మాట్లాడారు. జగన్ మాత్రం తాను పాద యాత్రలో ఇచ్చిన హామీ నిలుపుకుంటానని చెబుతూ వస్తున్నారు. కొత్త పీఆర్సీని ఇచ్చాక దీనిపై కూడా త్వరలోనే ఏదో ఒక నిర్ణయం వెలువరిస్తానని ఆ రోజు అన్నారు. అయితే ఆర్థికంగా ఎంతో భారంగా ఉండే ఈ వ్యవహారంపై బుగ్గన అనే ఆర్థిక శాఖ మంత్రి తేల్చేద్దాం అంటున్నారు. వినేందుకు బాగుంది కానీ కోట్ల రూపాయల్లో ఖజానాకు భారం కలిగించే పరిణామాలపై ఎప్పటిలానే పై పై మాటలే చెబుతున్నారా లేదా క్షుణ్ణంగా అధ్యయనమే చేశారా? అన్నది విపక్షం నుంచి వస్తున్న అనుమానం.
సీపీఎస్ వివాదం క్లైమాక్స్ కు చేరుకుందని తెలుస్తోంది. కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం పై గత కొంత కాలంగా రగులుతున్న రగడకు ముగింపు ఇవ్వాలని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో ఒకటి తేల్చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే గడిచిన నెల రోజుల నుంచి తాము సమాలోచనలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నిన్నటి వేళ సభకు విన్నవించారు.అంటే త్వరలోనే సంబంధిత ఉద్యోగులకు ఓ తీపి కబురు అందించేందుకు,గత ప్రభుత్వం కన్నా వేగంగానే ఏదో ఒకటి చెప్పేందుకు బుగ్గన సన్నద్ధం అవుతున్నారు అని తేలిపోయింది. అసలు ఇంత వేగంగా ఈ ప్రక్రియ ఎందుకు కొలిక్కి వచ్చిందో ఆలోచిస్తే ఆశ్చర్యపోవడం ప్రజల వంతు కావడం తథ్యం.
ఎందుకంటే కొత్త పీఆర్సీ లో చాలా మెలికలు గమ్మత్తులు ఉన్నాయని, అలా కాకుండా సీపీఎస్ పై ఓ స్పష్టత ఇస్తే రానున్న ఎన్నికల్లో పవన్ కానీ చంద్రబాబు కానీ దీనిపై మాట్లాడేందుకు అవకాశమే ఉండదని వాదిస్తున్నారు వైసీపీ నాయకులు. సీపీఎస్ రద్దుపై ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఆలస్యం అయినా ఆర్థిక భారం మోసేందుకు ఖజానా సిద్ధంగా లేకపోయినా మధ్యే మార్గంగా కొన్ని నిర్ణయాలు వెలువరించే అవకాశం ఉంది. రెగ్యులర్ పెన్షనర్ కు దక్కే అన్ని సదుపాయాలు ఇప్పటికిప్పుడు ఇవ్వలేకపోయినా పదవీ విరమణ అనంతరం కొంత మొత్తం ముందుగానే ఇచ్చి తరువాత కాలంలో ఏమయినా ఆర్థిక ప్రయోజనాలు దక్కేలా చేసేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర దారులు వెతికే అవకాశాలు ఉన్నాయి. అయినా రాష్ట్రాల పరిధిలో సీపీఎస్ రద్దు చేస్తామని కొందరు అంటున్నా కేంద్రం మాత్రం ఇందుకు పెద్దగా సుముఖత చూపడం లేదు. ఎందుకంటే ఆ రోజు సీపీఎస్ కు అనుమతి ఇచ్చింది, సమ్మతి తెలిపింది రాష్ట్రాలేనని ఇప్పుడు మాత్రం ప్రజా వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని మాట మార్చడం తగదని ఢిల్లీ బీజేపీ పెద్దలతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.