టీడీపీ దూకుడు భేష్‌.. కానీ, ఇలా కావ‌డం బాగోలేదు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌ను గ‌మ‌నిస్తున్న వారు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చేస్తున్న దూకుడును ప్ర‌శంసి స్తున్నారు. వాస్త‌వానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాను చేసిన శ‌ప‌థం నేప‌థ్యంలో స‌భ‌కు రావ‌డం లేదు దీంతో త‌మ‌కు స‌భ‌ను డీల్ చేయ‌డం ఈజీనేన‌ని.. వైసీపీ నాయ‌కులు భావించారు. మ‌రీ ముఖ్యంగా సీఎం స‌హా స‌భాప‌తి కూడా టీడీపీ అధినేత రంగంలో లేక‌పోవ‌డంతో త‌మ‌కు ప‌ని సులువు అవుతుంద‌ని అనుకున్నారు. కానీ.. అలా జ‌ర‌గ‌డం లేదు. పైగా ఉన్న 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీకి చుక్క‌లు చూపిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

నిజానికి  ఇప్పుడు స‌భ‌లో 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్న‌ప్ప‌టికీ.. అసెంబ్లీలో టీడీపీ స‌త్తా చాటుతు న్నారు. దీంతో ప్ర‌భుత్వంపై పైచేయి సాధించేలా వ్య‌వహ‌రిస్తున్నార‌ని మేధావులు సైతం అంటున్నారు. ముఖ్యంగా జంగా రెడ్డి గూడెం ఘ‌ట‌న‌కు సంబంధించి.. అసెంబ్లీలో టీడీపీ నేత‌లు ఆస‌క్తిక‌ర వాయిస్ వినిపించారు. ఈ క్రమంలో అధికార పార్టీ స‌భ్యులు.. ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితిని క‌ల్పించా రు. గ‌తంలో చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న పార్టీ నాయ‌కులు అసెంబ్లీలో గ‌ళం వినిపించేవారు.

అయితే.. ఇప్పుడు .. చంద్ర‌బాబు స‌భ‌కు వెళ్ల‌డంలేదు. దీంతో టీడీపీలో లోటు క‌నిపిస్తుంద‌ని… అధికార ప‌క్షం స‌భ‌లో పైచేయి సాధించ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు.. స‌భ‌లో పార్టీ నేత‌లు వాయిస్ కూడా వినిపించే ప్ర‌య‌త్నం చేయ‌లేర‌ని కూడా  కొంద‌రు వైసీపీ నేత‌లు భావించారు. అయితే.. అనూహ్యంగా టీడీపీ నాయ‌కులు.. అధికార పార్టీపై పుంజుకునే ప్ర‌య‌త్నం చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం రోజు.. నుంచి వ‌రుస‌గా వారు స‌భ‌లో అధికార పార్టీని నిలదీసిన వైనం.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన స‌మావేశాల్లో టీడీపీ అనుస‌రించిన వ్యూహాల‌కు భిన్నంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది.  

అదేవిధంగా బ‌డ్జెట్‌పైచ‌ర్చ సంద‌ర్భంగా.. జంగారెడ్డి గూడెం మ‌ర‌ణాల అంశాన్ని ప్ర‌స్తావించారు. ఈ ప‌రిణామం.. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టింది. అంతేకాదు.. ఎదురు దాడి చేసి… ఆత్మ‌ర‌క్ష‌ణ ప‌రిస్థితిని ఎదుర్కొనాల్సి రావ‌డం వైసీపీకి మ‌రింత ఇబ్బంది క‌రంగా మారింది. అయితే.. ఇక్క‌డ టీడీపీ నేత‌ల దూకుడు.. వారు స‌స్పెండ్ అయ్యేలా దారితీస్తోంది. ఈ విష‌యంలో వారు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటే.. పార్టీ వాయిస్ వినిపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని..  ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు కూడా ఉంటుంద‌ని మేధావులు చెబుతున్నారు. ఈ ఒక్క విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని.. స‌స్పెండ్ కాకుండా.. చూసుకోవాల‌ని.. దూకుడు మాత్రం కొన‌సాగించాల‌ని.. మేధావులు నుంచి కూడా సూచ‌న‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తారోచూడాలి.