మ‌రోసారి కేసీఆర్ ట్రాప్ లో కాంగ్రెస్‌..!

తెలంగాణ కాంగ్రెస్ మ‌రోసారి కేసీఆర్ ఉచ్చులో బిగుసుకుందా..? టీఆర్ఎస్ రేస్ చేసిన‌ట్లుగా భావిస్తున్న ఒక ఇష్యూలో పాల్గొని కాంగ్రెస్ నేతలు త‌ప్పు చేశారా..? అన‌వ‌స‌ర వివాదంలో ఇరుక్కొని ఒక వ‌ర్గం నేత‌ల ఆగ్ర‌హానికి గుర‌య్యారా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కొద్ది నెల‌ల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో కేసీఆర్ తో భేటీ కావ‌డంతో ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సంకేతాలు వెళ్లిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో సంఘ‌ట‌న అలాంటిదేన‌ని చెప్ప‌వ‌చ్చు.

ఖ‌మ్మం జిల్లాలో మ‌రియ‌మ్మ లాక‌ప్ డెత్ కు సంబంధించిన విష‌యంలో పోలీసుల వైఖ‌రిపై ఫిర్యాదు చేసేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వీరు అడిగిందే త‌డువుగా కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్ ఓపెన్ చేయ‌డంతో భ‌ట్టి విక్ర‌మార్క ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యేలు ఆయ‌న‌తో భేటీ అయ్యారు. అదే స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడి ఎంపిక‌పై ఢిల్లీలో క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. రేవంత్ కు ప‌ద‌వి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తేల‌డంతోనే వీరు కేసీఆర్ తో చ‌ర్చించారని.. వీరు టీఆర్ఎస్ లో చేర‌డ‌మే త‌రువాయి అనే విధంగా పార్టీ శ్రేణుల్లో సంకేతాలు వెళ్లాయి. దీంతో అధిష్ఠానం ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా రేవంతునే అధ్య‌క్షుడిగా ఖ‌రారు చేసింది. అలా ఆ గండం నుంచి కాంగ్రెస్ గ‌ట్టెక్కింది.

తాజాగా చిన జీయ‌ర్ విష‌యంలో కాంగ్రెస్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింద‌నే ఆరోప‌ణ‌లు విన‌వ‌స్తున్నాయి. ప్ర‌ధాని ముచ్చింత‌ల్ ప‌ర్య‌ట‌న నుంచి చిన జీయ‌ర్ కు, కేసీఆర్ కు దూరం పెరిగింది. యాదాద్రిలో నిర్వ‌హించ‌నున్న ఉద్ఘాట‌న‌కు కూడా ఆహ్వానం పంప‌లేదు. అలాగే.. ఎప్పుడో ఇర‌వై ఏళ్ల క్రితం వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. చిన జీయ‌ర్ స‌మ్మ‌క్క సార‌క్క గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా ఉన్నాయ‌ని తెలంగాణ ప్ర‌జ‌లు అనుమానిస్తున్నారు. వారు దేవ‌త‌లు కార‌ని.. అడ‌వి నుంచి వ‌చ్చిన వార‌ని వారి పేరిట వ్యాపారాలు చేస్తున్నార‌ని ఆ వీడియోలో ఉంది.  ఈ వీడియో బ‌య‌టికి రావ‌డం వెనుక అధికార పార్టీ హ‌స్తం ఉంద‌ని ఒక వ‌ర్గం ఆరోపిస్తోంది. చిన జీయ‌ర్ కు, కేసీఆర్ కు విభేదాలు రావ‌డంతోనే ఈ వీడియోను వ‌దిలార‌ని భావిస్తోంది.

అయితే.. టీఆర్ఎస్ కంటే ముందుగానే ఈ విష‌యంలో కాంగ్రెస్ స్పందించింది. తొలుత ములుగు ఎమ్మెల్యే సీత‌క్క చిన జీయ‌ర్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. స‌మ‌తామూర్తి విగ్ర‌హం పేరుతో వ్యాపారం చేస్తున్న‌ది ఆయ‌నేన‌ని ఆరోపించారు. చిన జీయ‌ర్ అంటే ఎప్ప‌టి నుంచో ప‌డ‌ని రేవంత్ రెడ్డి కూడా ఆయ‌న‌పై ఘాటుగానే విమ‌ర్శ‌లు చేశారు. యాదాద్రి స‌ల‌హాదారు ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో టీఆర్ఎస్సే గ‌మ్మున ఉంటే కాంగ్రెస్ నేత‌లు అన‌వ‌స‌రంగా కెలుక్కుని ఈ వివాదంలో చిక్కుకున్నార‌ని మ‌రో వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది. మ‌రోసారి కేసీఆర్ ట్రాప్ లో ప‌డిపోయార‌ని అంటున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!