తమిళనాట రాజకీయాలు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ విజయం చాలా ముందే ఖరారైపోయింది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ అంతకంతకూ బలహీనపడిపోవడం.. మరోవైపు కొత్తగా వచ్చిన కమల్ హాసన్ పార్టీ కనీస ప్రభావం కూడా చూపించలేకపోవడం, మిగతా పార్టీల నుంచి కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో ఎన్నికల్లో విజయం స్టాలిన్‌కు నల్లేరుపై నడకే అయింది.
ఇక ఎన్నికల్లో గెలిచాక స్టాలిన్ జనరంజకమైన పాలనతో ముందుకు వెళ్తున్నారు. ఆయన బలం అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ప్రతిపక్షం చాలా బలహీనంగా మారిపోయింది. జయలలిత, కరుణానిధిల మరణానంతరం కొంతమేర రాజకీయ శూన్యత ఏర్పడినప్పటికీ దాన్ని ఉపయోగించుకోవడంలో కమల్ కానీ, రజినీకాంత్ కానీ విజయవంతం కాలేకపోయారు. కమల్ పార్టీ పెట్టినా ప్రయోజనం లేకపోయింది.
రజినీ అసలు రంగంలోకి దిగకుండానే అస్త్రసన్యాసం చేశారు.ఐతే తమిళనాట రాజకీయాల్లో సినిమా నటుల ప్రభావం అయిపోయిందని అనుకోవడానికి మాత్రం వీల్లేదు. ప్రస్తుతం రజినీని మించి, తమిళంలో బిగ్గెస్ట్ స్టార్‌గా అవతరించిన విజయ్ ఏదో ఒక రోజు రాజకీయాల్లో అడుగు పెట్టడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. సినిమాల్లో, బయట తన చర్యల ద్వారా తన రాజకీయ ఉద్దేశాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నాడు విజయ్. అతను వచ్చే ఎన్నికల సమయానికి రంగంలోకి దిగొచ్చనే అంచనాలున్నాయి.
అందుకు ఇప్పట్నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. విజయ్ తాజాగా పేరుమోసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో తాజాగా రహస్యంగా భేటీ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ సన్నిహితులు కూడా ఈ సమావేశాన్ని ధ్రువీకరిస్తున్నారు. నిజానికి రజినీ రాజకీయాల్లోకి వస్తానన్నపుడు వ్యూహాల రచనకు తనకు తానుగా ప్రశాంత్ ముందుకొచ్చాడని, కానీ అతడి తరహా రాజకీయం నచ్చక రజినీ నో చెప్పాడని అప్పట్లో ప్రచారం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను అధికారం తేవడానికి ప్రశాంత్ పన్నిన కుయుక్తుల గురించి పెద్ద చర్చే నడిచింది. తన క్లయింట్‌ను గెలిపించడానికి ప్రశాంత్ ఎంతకైనా దిగజారతాడని, అందుకోసం కుట్రలు, కుతంత్రాలు పన్నడానికి, కల్లోల పరిస్థితులు తేవడానికి కూడా వెనుకాడడని పేరుంది. మరి అలాంటి వ్యక్తితో జట్టు కడితే విజయ్ నుంచి కొత్త తరహా, స్వచ్ఛమైన రాజకీయాలను ప్రజలు ఆశించగలరా?
Gulte Telugu Telugu Political and Movie News Updates