ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. సిక్కుల కోటలో కాంగ్రెస్, బీజీపీ సీట్లను చీపురు పెట్టి క్లీన్ స్వీప్ చేశారు కేజ్రీవాల్. భగవంత్ మాన్ వంటి యువనేతను పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. పంజాబ్‌లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్…మొత్తం 117 స్థానాలకు గాను 92 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో, పంజాబ్‌లోని మొత్తం 5 రాజ్యసభ స్థానాలు ఆప్ ఖాతాలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఐదుగురిలో ఒకరిగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్‌ను ఆప్ తరఫున రాజ్యసభకు పంపాలని కేజ్రీవాల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
పంజాబ్ సీఎంగా ఎన్నికైన భగవంత్ మాన్ కు హర్భజన్ సింగ్ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. పంజాబ్ నుంచి ఎన్నికైన ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. దీంతో, ఆ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ను ఈసీ విడుదల చేసింది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 21 కాగా, మార్చి 31న పోలింగ్, కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనున్నారు.
పంజాబ్ కు సేవ చేయాలనుందని, రాజకీయాల ద్వారానా, వేరే రూపంలోనా అన్నది కాలమే నిర్ణయిస్తుందని భజ్జీ గతంలో చెప్పాడు. సమాజం తనకు ఎంతో ఇచ్చిందని, సమాజానికి తిరిగిచ్చే సమయం ఆసన్నమైందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. దీంతో, 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు అమృత్‌సర్ లోక్ సభ స్థానం నుంచి భజ్జీని బరిలోకి దింపడానికి బీజేపీ గాలం వేసినా టర్బోనేటర్ పడలేదు. అయితే, తాజాగా ఆప్ తరఫున రాజ్యసభకు వెళ్లేందుకు హర్భజన్ సింగ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు, ఎన్నికల ప్రచారం సందర్భంగా జలంధర్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. ఆ స్పోర్ట్స్ యూనివర్శిటీ నిర్మాణం, తదితర బాధ్యతలను కూడా భజ్జీకే అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. అయితే, క్రీడాకారుడిగా భజ్జీ తన దూకుడుతో పలు వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ఆసీస్ మాజీ క్రికెటర్ సైమండ్స్ తో మంకీ గేట్ వివాదం…ఐపీఎల్ సందర్భంగా శ్రీశాంత్ పై చేయి చేసుకోవడం వంటి వ్యవహారాల్లో భజ్జీ తీరు వివాదాస్పదమైంది. మరి, క్లీన్ ఇమేజ్ ఉన్న ఆప్ తరఫున భజ్జీ పెద్దల సభకు వెళతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.