కేజ్రీవాల్ స్పీడు  మామూలుగా లేదే

ఢిల్లీతో మొదలై తాజాగా పంజాబ్ లో జెండా ఎగరేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తన తర్వాత టార్గెట్ ను గుజరాత్ గా ఫిక్స్ చేసింది. పంజాబ్ అద్భుతమైన విజయంతో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లుంది. అందుకనే ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగబోతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలే తమ తర్వాత టార్గెట్ అని ప్రకటించారు.

గుజరాత్ లో పాగా వేయటానికి వీలుగా ఏప్రిల్ నుంచి  రాష్ట్రం మొత్తం అన్నీ జిల్లాలు, మండలాల్లో తిరంగా యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. గుజరాత్ లో బీజేపీ ఎంత బలంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే బీజేపీ బలానికి ప్రత్యర్ధి పార్టీల బలహీనతే అని కేజ్రీవాల్ బలంగా నమ్ముతున్నారు. గుజరాత్ లో దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఎన్నికల్లో ఢీ కొడుతున్నాయి. అంటే అక్కడ చెప్పుకోదగ్గ ప్రాంతీయ పార్టీ కానీ లేదా మూడో జాతీయ పార్టీ కానీ లేదని అర్ధమైపోతోంది.

బీజేపీ దెబ్బకు దాదాపు 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పూర్తిగా దెబ్బ తినేసింది. అందుకనే ఆప్ గుజరాత్ పైన దృష్టిపెట్టింది. పంజాబ్ లో కూడా దాదాపు గుజరాత్ పరిస్దితే ఉంది. ఇక్కడే కాంగ్రెస్ లేదా శిరోమణి అకాలీదళ్ మాత్రమే ఎన్నికల్లో ఢీ కొంటున్నాయి. ఇక్కడ బీజేపీ ఉన్నా ఏదో గెస్ట్ ఆర్టిస్టుగా మాత్రమే ఉంటోంది. అందుకనే పంజాబ్ పై ఆప్ దృష్టి పెట్టి 8 ఏళ్ళల్లో అధికారంలోకి వచ్చింది. ముందు స్ధానిక సంస్థల ఎన్నికల్లోకి దిగింది. తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసింది. ఇపుడు ఏకంగా అధికారంలోకే వచ్చేసింది.

అలాగే గుజరాత్ లో కూడా గట్టి ప్రతిపక్ష స్థానాన్ని ముందు భర్తీ చేసి తర్వాత అధికారంలోకి వస్తామని కేజ్రీవాల్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే గుజరాత్ లోని కొన్ని మున్సిపాలిటిల్లో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా అక్కడక్కడ ఆప్ నేతలు గెలిచారు. కాబట్టి ఆప్ ఊపు చూస్తుంటే తొందరలోనే గుజరాత్ లో కూడా కాంగ్రెస్ ను ముందు చాపచుట్టేసేట్లే ఉంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.