ఎస్పీ బాగానే పుంజుకుందా ?

ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి తాజాగా వెల్లడైన ఫలితాలను చూసిన తర్వాత ఈ విషయం స్పష్టమైంది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డైడ్ అనే సామెతలాగ తయారైంది సమాజ్ వాదీ పార్టీ పరిస్దితి. ఎన్నికల్లో ఓడిపోయినా ఓట్లను, సీట్లను గణనీయంగా పెంచుకోవటంలో ఎస్పీ బాగా పుంజుకున్నదనే చెప్పాలి. 2017లో 47 సీట్లకు మాత్రమే పరిమితమైన ఎస్పీ తాజా ఎన్నికల్లో మాత్రం 112 సీట్లకు చేరుకున్నది. అంటే సీట్లపరంగా చూస్తే దాదాపు 100 శాతానికి మించి సాధించింది.

అలాగే ఓట్ల శాతాన్ని చూస్తే 2017లో 21.82 శాతానికి పరిమితమైపోయింది. కానీ తాజా ఎన్నికల్లో 32.02 శాతం ఓట్లు సాధించింది. అంటే ఏకంగా 11 శాతం ఓట్లు పెరగిందన్నది గమనించాలి. ఓట్లు, సీట్లు ఇంతగా పెరగటానికి ప్రధాన కారణం ఏమిటి ? ఏమిటంటే బీజేపీ మీద జనాల్లోని వ్యతిరేకతే అనిచెప్పాలి. అవును బీజేపీ పాలనమీద జనాల్లో వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. కాకపోతే యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వాన్ని అధికారంలో నుండి దింపేయాలన్న వ్యతిరేకత అయితే లేదు.

నిత్యావసరాల ధరల పెరుగుదల, 18 శాతానికి చేరుకున్న నిరుద్యోగం, రైతుల్లోను వ్యతిరేకత పెరిగిందన్నది వాస్తవం. లేకపోతే ఎస్పీ సీట్ల సంఖ్య  47 నుండి 112కి పెరిగే అవకాశమే లేదు. ఇదే సమయంలో యోగి+నరేంద్రమోడిలపై జనాల్లో సానుకూలత కూడా కనబడింది. అందుకనే రెండోసారి కమలంపార్టీ అధికారంలోకి రాగలిగింది. కరోనా వైరస్ కాలంలో గోధుమలు, వంటనూనెలు, శెనగలను అర్హులైన పేదలకు ఉచితంగా పంపిణీచేయటం, లా అండ్ ఆర్డర్ ను మైన్ టైన్ చేయటం లాంటి కారణాల వల్ల జనాలు బీజేపీపై నమ్మకం ఉంచారు.

ఎన్నికల ఫలితాల సరళిని ప్రధానంగా గమనిస్తే మహిళా ఓట్లు ఎక్కువగా బీజేపీకి పడినట్లు అర్ధమవుతోంది. దీనికి ప్రధాన కారణం లా అండ్ ఆర్డర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరే యోగి ప్రభుత్వంపై ఎన్ని సానుకూలతలు ఉన్నా, రెండోసారి అధికారంలోకి వచ్చినా ఎస్పీ బాగా పుంజుకున్నది వాస్తవం. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గనుక పట్టువదలకుండా కష్టపడితే వచ్చే ఎన్నికలకు సానుకూల ఫలితాలు ఉంటాయేమో చూడాలి.