ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి వైసీపీ సర్కారు అర్ధాంతరంగా తొలగించబడ్డ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు నిజంగానే బీజేపీ మద్దతు దక్కిందనే చెప్పాలి. అంతేకాకుండా బీజేపీ నుంచి నిమ్మగడ్డకు దక్కిన మద్దతు అంతకంతకూ పెరుగుతోందని కూడా చెప్పక తప్పదు. వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు పరిశీలిస్తే ఈ మాట నిజమేనని ఒప్పుకోక కూడా తప్పదు.
మొత్తంగా వైసీపీ సర్కారు తనపై కక్ష కట్టి మరీ తనను పదవి నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించిందని న్యాయపోరాటం ఆరంభించిన నిమ్మగడ్డకు ఇప్పుడు వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీల దన్ను లభించిందనే చెప్పాలి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైన కీలక తరుణంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణతో పెను ముప్పేనన్న భావనతో ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ… ఎన్నికలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తమకు చెప్పకుండానే, తమ అభీష్టానికి విరుద్ధంగా నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారన్న ఆగ్రహంతో ఆయనను పదవి నుంచి వైసీపీ తప్పించింది.
ఇందుకోసం ఏకంగా ఎస్ఈసీ నియామకానికి సంబంధించి ఓ ఆర్డినెన్స్ ను కూడా జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని నిమ్మగడ్డ కోర్టును ఆశ్రయించారు. నిమ్మగడ్డకు అనుకూలంగా టీడీపీ కూడా న్యాయపోరాటాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో నిమ్మగడ్డ వ్యవహారంలో కోర్టులు ఏం చెప్పినా పెద్దగా పట్టించుకోని వైసీపీ సర్కారు… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు అనుకూలంగానే ఉందని భావించింది.
అయితే మొన్నటిదాకా ఈ విషయంలో బీజేపీ నేతలు పెద్దగా స్పందించలేదు. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టు కూడా నిమ్మగడ్డ వ్యవహారంలో వైసీపీకి వ్యతిరేకంగానే తీర్పులు వెలువరించిన నేపథ్యంలో బీజేపీ నేతలు మేల్కొన్నారనే చెప్పాలి.
మొన్నటికి మొన్న నిమ్మగడ్డకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇవ్వడానికి కారణం బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యమే. అంతేకాకుండా హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను తక్షణమే ఎస్ఈసీ పదవిలో నియమించాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏకంగా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేశారు. తమ పార్టీ అధిష్ఠానం సూచన మేరకే తాను ఈ పిటిషన్ వేశానని నాడు కామినేని చేసిన వ్యాఖ్యలు కలకలమే రేపాయి.
తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా నిమ్మగడ్డకు అండగా రంగంలోకి దిగారు. నిమ్మగడ్డను ఎస్ఈసీ పదవిలో పునర్నియమించాలని హైకోర్టు చెప్పిందని, ఆ మేరకు ఆయనను ఆ పదవిలో నియమించేలా చర్యలు చేపట్టాలని ఏకంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కే కన్నా లేఖ రాశారు.
హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాక కూడా నిమ్మగడ్డకు బాధ్యతలు అప్పగించకుండా వైసీపీ సర్కారు ఆయనకు నరకం చూపిస్తోందని సదరు లేఖలో గవర్నర్ కు కన్నా ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థ విషయంలో వైసీపీ సర్కారు జోక్యం చేసుకోవడం సరికాదని కూడా కన్నా అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో రాష్ట్ర అధిపతిగా ఉన్న గవర్నర్ ఈ విషయంలో తప్పనిసరిగా జోక్యం చేసుకుని నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించేలా చర్యలు చేపట్టాలని కూడా కన్నా డిమాండ్ చేశారు. మొత్తంగా బీజేపీ నుంచి నిమ్మగడ్డకు ఫుల్ సపోర్ట్ లభించందన్న మాట.