అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు బామ్మర్ది కూడా హిందూపూర్ ను జిల్లా కేంద్రం చేయాలంటూ తమను కోరారని, చంద్రబాబు కూడా తన సొంత నియోకవర్గం కుప్పంను రెవిన్యూ డివిజన్ చేయాలని అడుగుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఈ రెండు ఘటనలతో ఎవరికి ఎంత విజన్ ఉందో అర్ధమవుతోందని, దీనిని ప్రజలు గమనించాలని చంద్రబాబు, బాలకృష్ణలకు జగన్ చురకలంటించారు.
3 రాజధానులను వ్యతిరేకిస్తున్న వారు కూడా జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో.. తమకు పిటిషన్లు ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు ప్రజల భవిష్యత్ గురించిన ఆలోచన లేదని, ఆయనకు కావలసిందల్లా రాజకీయాలేనని జగన్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన జగన్…వారు గవర్నర్ ను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియాలంటూ సెటైర్లు వేశారు. కానీ, టీవీలో మాత్రం అసెంబ్లీ సమావేశాల లైవ్ ను ఆయన చూస్తూ ఉంటారని జగన్ పంచ్ లు వేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలా వ్యవహరించలేదని, అసలు చంద్రబాబు ఏదైనా ఒక మంచి పని చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వెన్నుపోటు మాత్రమేనని జగన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకొస్తున్నామని, అన్ని వర్గాల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదవాలన్నదే తమ ఆకాంక్ష అని జగన్ చెప్పారు. గ్రామాల్లోకి వెళితే..తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అర్థమవుతుందని జగన్ అన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు వేస్తూ ఆటంకం కలిగిస్తున్నారని, అ కేసుల్లో వచ్చే తీర్పులు ప్రజలకు నష్టం కలిగిస్తాయని తెలిసినా చంద్రబాబు అలా కేసులు వేసి ఆనందిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇలాంటి సంకుచితమైన చంద్రబాబు నిర్ణయాలకు… విస్తృత ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న పనులకు తేడా గుర్తించాలని ప్రజలను జగన్ కోరారు.