చైనా బార్డర్‌లో ఉద్రిక్తత, మన సైన్యం ఎంత ఉంది?

India-China

భారత్ – చైనా బలగాల మధ్య లఢక్ వద్ద గాల్వాన్ లోయలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకొని 20 మంది మన సైనికులు అమరులయ్యారు. చైనా వైపు కూడా 43 మంది మరణం లేదా గాయాలై భారీ నష్టమే జరిగిందనే వాదనలు ఉన్నాయి. చర్చలు అంటూనే చైనా భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. దీనికి భారత సైనికులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి బలం ఎంత, యుద్ధమే జరిగితే భారత సైన్యం ఎంత అనే చర్చ సాగుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కలిగిన దేశాల్లో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 2019 ప్రకారం చైనాకు 21,83,000 మిలిటరీ మ్యాన్ పవర్ ఉంది. అమెరికాలో 12,81,900, ఉత్తర కొరియాలో 12,80,000, రష్యాకు 10,13,628, పాకిస్తాన్‌కు 6,54,000, దక్షిణ కొరియాలో 6,25,000, ఇరాన్‌లో 5,23,000 సైన్యం ఉంది.

మన ఇండియన్ ఆర్మ్డ్‌ ఫోర్సెస్ విషయానికి వస్తే ఆర్మీలో యాక్టివ్‌గా 1,237,117, రిజర్వ్‌లో 960,000 ఉన్నారు. ఇండియన్ నేవీలో 67,228 మంది, రిజర్వ్‌లో 55,000 మంది ఉన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 139,576 ఉండగా, రిజర్వ్‌లో 140,000 ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో యాక్టివ్ రోల్‌లో 1,443,921 ఉండగా, రిజర్వ్‌లో మొత్తం 1,155,000 ఉంది.

పారామిలిటరీ ఫోర్స్ విషయానికి వస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ 11,000, అసోం రైఫిల్స్ 66,000, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ 10,000 ఉంటారు. ఇండియా – చైనా బార్డర్‌లో ఇండో – టిబెటన్ బార్డర్ పోలీస్ 89,432 ఉంది. హిమాలయ పర్వతసానుల్లో చైనా సరిహద్దుల్లో రక్షణను బలోపేతం చేసేందుకు భారత్ మౌంటేన్ స్ట్రైక్ దళాలను పెంచింది. దీని ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్ పనాగర్‌లో ఉంది. వీరు లడక్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎల్ఏసీ పొడవున 4,057 కిలోమీటర్లు ఉంటారు. పారా స్పెషల్ ఫోర్సెస్ బెటాలియన్ కూడా ఉన్నాయి. చైనా ఏదైనా దాటి చేస్తే వీరు వేగవంతంగా స్పందిస్తారు.