వివేకా కేసుపై తొలిసారి స్పందించిన సవాంగ్
వివేకా కేసు జగన్ పై సవాంగ్ సంచలన వ్యాఖ్యలు
వివేకా కేసులో జగన్ అలా చేయమన్నారు:సవాంగ్
వివేకా మర్డర్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరి మొదలు..తాజాగా వివేకా భార్య సౌభాగ్యమ్మ ఇచ్చిన వాంగ్మూలం వరకు ఒక్కొక్కటిగా సంచలన విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.
ఆ వాంగ్మూలాలలో సీఎం జగన్ పై కూడా సునీతా రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ డీజీపీ సవాంగ్ పై కూడా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో, తాజాగా ఆ ఆరోపణలపై సవాంగ్ స్పందించారు. తాను డీజీపీగా ఉన్న సమయంలో వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి సీఎం జగన్ తో మాట్లాడానని వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
వివేకా కేసు విషయంలో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, దోషులకు శిక్ష పడేలా చూడాలనే తనతో చెప్పేవారని సవాంగ్ స్పష్టం చేశారు. వివేకా కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని జగన్ ఆదేశించారని, సీబీఐ అధికారులకు అన్ని వివరాలను సమర్పించాలని చెప్పారని సవాంగ్ వెల్లడించారు. డీజీపీగా ఉన్నప్పుడు తాను వివేకా కేసుపై ఫలానా వ్యాఖ్యలు చేశానని వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలను సవాంగ్ ఖండించారు.
తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్న ఉద్దేశంతోనే తాను ఆనాడు జరిగిన విషయాలపై ఇప్పుడు స్పందించాల్సి వస్తోందని చెప్పారు. వివేకానందరెడ్డి, అవినాశ్‌రెడ్డి కుటుంబాలు తనకు రెండు కళ్లు లాంటివని జగన్ చెప్పారని అన్నారు. సెప్టెంబరు 2019లో సునీత, రాజశేఖర్‌రెడ్డి తనను కలిశారని, ఇదే విషయాన్ని వారికి చెప్పానని గుర్తు చేసుకున్నారు. తాను డీజీపీగా ఉన్న సమయంలో అవినాశ్‌రెడ్డి గానీ, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి గానీ, డి.శివశంకర్‌రెడ్డి గానీ ఏనాడు తనను కలవలేదని సవాంగ్ స్పష్టం చేశారు.