టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు, సీఎం జగన్‌కు మధ్య లింకులు తెగిపోయాయని.. వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలు భయంతో బతకాలనేది జగన్ లక్ష్యమని అన్నారు. అన్ని వ్యవస్థలపైనా సీఎం జగన్ దాడి చేస్తున్నారని.. ఇప్పుడు సినిమా పరిశ్రమపై దాడి మొదలుపెట్టారని అన్నారు. వైసీపీకి చెందిన మంత్రి స్వయంగా పోలీసులపై అసభ్యంగా మాట్లాడితే నో పోలీస్ అంటున్నారని ఎద్దేవా చేశారు.
శాసన సభ సాక్షిగా మా అమ్మ క్యారెక్టర్ను దూషించారని, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వారి కుమార్తె గురించి నేను కూడా మాట్లాడవచ్చునని, కానీ, తమకు సంస్కారం అడ్డువస్తుందని లోకేష్ అన్నారు. “శాసనసభలో మా అమ్మని అవమానించారు..2024 తర్వాత మాట్లాడిన వారందరూ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టను.. మా తల్లికి నేను శపథం చేస్తున్నా“ అని అన్నారు. విశాఖలో మున్సిపల్ స్టేడియం ఆస్తులు కూడా తాకట్టు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
రాజధాని కోసం ఒక్క ఇటుకైనా వేశారా.. అని లోకేష్ ప్రశ్నించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకువచ్చారని అన్నారు. కాగా, లోకేశ్ సోమవారం విశాఖలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. తనపై అసత్య ప్రచారం చేసినందుకుగాను లోకేశ్ సాక్షి పత్రికపై రూ. 75కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 24వ తేదీన కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసు సోమ వారాని కి వాయిదా పడడంతో మళ్లీ హాజరయ్యారు.
6/2020 నెంబరుతో దాఖలైన వ్యాజ్యంలో తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా దురుద్దేశంతో సాక్షి పత్రికలో తప్పుడు కథనం ప్రచురించారని లోకేష్ పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి అనుకూల పత్రిక నాపైన, మానాన్నపైన తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల సహాయంతోనే వివేకానంద రెడ్డిని హత్యచేశారని ఆరోపించారు.
చినబాబు చిరుతిళ్లు అనే శీర్షీకతో సాక్షి, డెక్కన్ క్రానికల్ లో వార్త రాశారని.. సాక్షిపై రూ.75 కోట్లు, డెక్కన్ క్రానికల్ రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేశానని ఆయన తెలిపారు. ఈనెల 28న, వారికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. తనను రాజకీయాల్లో ఎదగకూడదని పదేపదే తప్పుడు వార్తలు రాస్తున్నారని, తనకు జరిగిన అన్యాయం మరి ఎవ్వరికీ జరగకుండా ఉండేలా న్యాయ పోరాటం చేస్తానని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates