ఈ రోజు చనిపోయిన సైనికాధికారి మన వాడట !

ఈ రోజు లడఖ్ పరిధిలోని గాల్వన్ వ్యాలీ వద్ద చైనా – భారత సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మరణించినట్లు ఉదయం వార్తలు విన్నాం కదా. ప్రపంచమంతా చీ కొడుతున్నా చైనా బుద్ధి మారలేదు. అయితే అత్యంత విషాదకరం ఏంటంటే… ఈరోజు దేశం కోసం తుది శ్వాస విడిచిన వ్యక్తి సూర్యాపేట వాసి అని తాజాగా వెల్లడయ్యింది. ఆర్మీ అధికారులు వారి కుటుంబానికి ఈ రోజు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగు చూసింది.

సరిహద్దులో చనిపోయిన కల్నల్‌ సంతోష్‌.. భార్యాపిల్లలున్నారు. వారి కుటుంబం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని విద్యానగర్ లో ఉంటోంది. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే సూర్యాపేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చైనా దాహానికి, కవ్వింపులకు మన తెలుగువాడు బలికావడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. రేపు సాయంత్రం లోపు సంతోష్ భౌతిక కాయం సూర్యపేటకు చేరుకోనుంది. ఈ వార్త విన్న వెంటనే సంతోష్ భార్య కుప్పకూలిపోయారు. తండ్రికి ఏం జరిగిందో తెలియని అమాయకపు దశ ఆ చిన్నారులు ఇద్దరిదీ. ఎంతో భవిష్యత్తు ఉన్న సంతోష్ ఇలా అర్ధంతరంగా కన్నుమూయడం విషాదకరం.