బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మించేందుకు కొత్త ఎత్తుగడను మొదలుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మేరకు మహారాష్ట్ర టూర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. శివసేన రథసారథి, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశం ఎజెండాగా ఆయన మహారాష్ట్ర టూర్ సాగింది. ఈ ఇద్దరు నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ విజయవంతంగానే జరిగింది. అయితే, ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్ మాత్రం కేసీఆర్ కలలు కల్లలు చేసే విధంగా మాట్లాడరని చర్చ జరుగుతోంది.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఆయన నివాసంలో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు ముచ్చటించారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన శరద్ పవార్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమ పథకాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. “దేశంలో ఉన్న పేదరికం కావచ్చు.. రైతుల సమస్యలు కావచ్చు.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి మేము చర్చించాం. రాజకీయంగా పెద్దగా ఏం చర్చించలేదు. ఎక్కువగా దేశ అభివృద్ధి గురించే మాట్లాడాం. భవిష్యత్తులోనూ కేసీఆర్‌ను కలుస్తాం. ఇంకా చాలా విషయాలు చర్చిస్తాం“ అని శరద్ పవార్ స్పష్టం చేశారు.
దేశం కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకు ప్రాంతీయ పార్టీలతో వేదిక ఏర్పాటు చేసేందుకు శరద్ పవార్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కాగా, ఎన్సీపీ రథసారథి మాత్రం రాజకీయాలు చర్చించనే లేదని, వివిధ అంశాలను చర్చించామని తెలియజేయడంతో కేసీఆర్ అనుకున్నది ఒకటి…. అక్కడ జరిగింది ఒకటి అని చర్చించుకుంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశంలో సానుకూల స్పందన పొందిన కేసీఆర్.. ఎన్సీపీ రథసారథి పవార్ తో మాత్రం అలాంటి స్పందన పొందలేకపోయారని చెప్తున్నారు.