ఈ రోజుల్లో కూడా అదృష్టం.. దురదృష్టం అన్నది ఉంటుందా? అని కొందరు ఎటకారంగా ప్రశ్నించొచ్చు. కానీ.. జరిగే కొన్ని పరిణామాల్ని చూసినప్పుడు.. నిజంగానే ఈ రెండు కొన్నింటి విషయాల్లో తప్పక ఉండాలన్న భావన కలగటం ఖాయం. ఎక్కడిదాకానో ఎందుకు తెలంగాణ రాష్ట్ర సాధన అంశాన్నే తీసుకోండి. అదృష్టమైన అంశం ఏమంటే జాతీయ స్థాయిలో కానీ.. రాష్ట్ర స్థాయిలో ఏం జరిగినా.. ఎలాంటి పరిణామం చోటు చేసుకున్నా సరే.. ఆ వెంటనే ప్రత్యేక తెలంగాణకు సంబంధించిన ఒక ప్రశ్న తెర మీదకు వచ్చేది. దాని మీద ప్రశ్నలు మీద ప్రశ్నలు వేసే వారు. అవన్నీ ప్రత్యేక తెలంగాణ అంశానికి ముడిపడి ఉండేవి.
ఇందుకు ఉదాహరణగా జయప్రకాశ్ నారాయణ (జేపీ) లోక్ సత్తా పార్టీ పెట్టిన వేళ.. తెలంగాణ రాష్ట్ర సాధన మీద మా స్టాండ్ ఏమిటి? అని ప్రశ్నించటం.. అది ఆ తర్వాత చిరంజీవి.. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టే వేళలోనే కాదు.. చివరకు ఒక ఓటుకు రెండు రాష్ట్రాలనే నినాదాన్ని పట్టుకు తిరిగే బీజేపీ వారు సైతం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద తమ కమిట్ మెంట్ పై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇవ్వటంతో పాటు.. ఆ అంశంపై తమ స్టాండ్ ను చెప్పుకోవాల్సి వచ్చేది.
దురదృష్టం ఏమంటే.. ఏపీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా అంశాన్ని మోడీ సర్కారు పక్కన పెట్టేయటం తెలిసిందే. ఎవరెన్ని అడిగినా.. ఏం చేసినా లైట్ తీసుకునే ధోరణి అంతకంతకూ ఎక్కువైందనే చెప్పాలి. అయితే.. ఇదే ప్రత్యేక హోదా కోసం పలువురు ప్రాణ త్యాగాన్ని చేయటం తెలిసిందే. రాజకీయ పార్టీలు తమ అవసరానికి అనుగుణంగా ప్రత్యేక హోదా మీద గళం విప్పటమే తప్పించి.. దాన్ని సాధించే విషయంలో చూపించాల్సినంత కమిట్ మెంట్ చూపించలేదనే చెప్పాలి. అదే సమయంలో.. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాల్సిన సమయంలోనూ.. దాని మీద చర్చ జరగటానికి వీలుగా అటు రాజకీయ నేతలు మాత్రమే కాదు.. ఇటు ఏపీ మేధావులు.. ఏపీకి చెందిన మీడియా సంస్థలు కానీ గళం విప్పింది లేదు. ప్రశ్నిస్తున్నది లేదు.
ఎక్కడిదాకానో ఎందుకు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నట్లుగా ప్రకటించటం.. అందులో భాగంగా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో మాట్లాడటం చేస్తున్నారు. ఇలాంటప్పుడు జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్న కేసీఆర్ ను.. ఏపీకి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా మీద ఆయన స్టాండ్ ఏమిటని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా? దేశ విశాల ప్రయోజనాల కోసం.. రాష్ట్రాల హక్కుల్ని కాపాడేందుకు గళం విప్పుతానని చెబుతున్న ఆయన.. తన సోదర రాష్ట్రమైన ఏపీకి విభజన కారణంగా జరిగిన నష్టం ఎంతన్న విషయం ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు.
అలాంటప్పుడు.. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా అంశం మీద ఆయన ఏమనుకుంటున్నారు? ఆయన వాదన ఏమిటి? ఒక కూటమిలా ఏర్పడితే.. ఏపీకి ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? దేశ ప్రధానమంత్రి రాజ్యసభలో స్వయంగా ప్రకటించిన మాట.. ఆచరణలోకి ఎందుకు రావటం లేదని ప్రశ్నించాలి కదా? అలాంటిదేమీ లేకపోవటం.. గళం విప్పాల్సిన నేతలు నోరు మూసుకొని ఉంటే.. వారిని మేల్కొలిపి.. ఏపీ ప్రజల హక్కుల సాధన కోసం నడుం బిగించేలా కార్యోన్ముఖుల్ని చేయటం కూడా అవసరం కదా? అలాంటిదేమీ ఎందుకు జరగటం లేదన్నది ప్రశ్న. ఇదంతా చూసినప్పుడు ఆంధ్రోళ్లకు మించిన దురదృష్టవంతులు మరెవరూ ఉండరనటంలో సందేహం లేదు. కాదంటారా?