ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహంపై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. గత శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. రామానుజాచార్యుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని చైనాలో తయారుచేయడాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆత్మనిర్భర్ భారత్ గురించి కామెంట్లు చేశారు.
చైనాకు చెందిన ఏరోసన్ కార్పొరేషన్ కంపెనీ రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని తయారుచేసింది. ఈ పంచలోహ విగ్రహంలో 83శాతం రాగి వినియోగించగా.. వెండి, బంగారం, జింక్, టైటానియం లోహాలను ఉపయోగించారు. 1600 విడిభాగాలుగా భారత్కు తీసుకొచ్చిన ఈ విగ్రహాన్ని 15 నెలల పాటు శ్రమించి అతికించారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చైనాలో తయారు చేశారు.. నవ భారత్ ఇండియా చైనాపై నిర్భరమేనా అంటూ ప్రధానికి చురకలంటించారు. ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో ఏర్పాటుచేసిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్న సంగతి తెలిసిందే.
త్వరలోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సైతం దర్శించనున్నారు. మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, వైఎస్ జగన్ సమతామూర్తిని దర్శించుకున్నారు. ఇలా స్థానిక నేతలు మొదలుకొని దేశంలోని అత్యంత ప్రముఖుల దర్శనీయ కేంద్రంగా నిలిచిన సమతామూర్తిపై రాహుల్ వ్యాఖ్యలు సహజంగానే హాట్ టాపిక్‌గా మారాయి.