మొత్తానికి ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమ్మెకు శుభం కార్డు పడింది. పీఆర్సీ వివాదంతో 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయాలన్న పిలుపును ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విరమించుకున్నట్లు ప్రకటించాయి. శనివారం మంత్రుల కమిటి, ఉద్యోగుల నేతల మధ్య జరిగిన చర్చలు రాత్రి సక్సెస్ అయ్యాయి. దాంతో పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామరెడ్డి సమ్మెను విరమించుకున్నట్లు ప్రకటించారు.
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకున్నందుకు పీఆర్సీ సాధన సమితి నేతలు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హోల్ మొత్తం మీద గమనించాల్సిందేమంటే సమ్మెకు ప్రధాన కారణమైన ఫిట్మెంట్ 23 శాతం నుండి పెరగలేదు. 23 శాతం ఫిట్మెంట్ తో కొత్త పీఆర్సీ కారణంగా తమకు జీతాలు తగ్గిపోతాయనేది ఉద్యోగుల నేతల ప్రధాన ఆరోపణ. అయితే కొత్త పీఆర్సీ వల్ల జీతాలు పెరుగుతాయే కానీ తగ్గవని ప్రభుత్వం చెబుతోంది.
కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు పెరిగాయని పే స్లిప్పుల ద్వారా బయటపడింది. సరే ఫిట్మెంట్ 23 శాతం మించి పెంచకపోయినా హెచ్ఆర్ఏ శ్లాబులు పెంచటం, ఐఆర్ రికవరీ ఉండదని చెప్పటం, ఐదేళ్ళకొకసారి పీఆర్సీ నియామకం, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 80 నుండి మళ్ళీ 75కి తగ్గించటం లాంటి డిమాండ్లను ప్రభుత్వం ఆమోదం చెప్పటంతో సమ్మె విరమించినట్లు నేతలు ప్రకటించారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే ఫిట్మెంట్ లో ఎలాంటి మార్పు లేకపోయినా సమ్మె విరమణకు ఉద్యోగుల నేతలు అంగీకరించటం. సమ్మెకు మూల కారణమే ఫిట్మెంట్ అయినపుడు మరి దాన్ని పెంచకపోయినా సమ్మె విరమణకు ఉద్యోగుల నేతలు ఎలా ఒప్పుకున్నారు ? మిగిలిన డిమాండ్ల సాధనకు చర్చలు ద్వారా పరిష్కారమయ్యేదానికి సమ్మెదాకా ఎందుకు వెళ్ళారో నేతలే చెప్పాలి. ఏదేమైనా సమ్మె విరమించుకోవటం శుభపరిణామమనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates