రామానుజాచార్యుల సమతాసూత్రమే మన రాజ్యాంగానికీ స్ఫూర్తి అని ప్రధాని స్పష్టం చేశారు. అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేడ్కర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో ఐక్యత, సమానతదీ కీలకపాత్ర అని మోడీ వెల్లడించారు. హైదరాబాద్ ఏర్పాటులో సర్దార్ పటేల్ కీలకపాత్ర పోషించారన్న మోదీ.. ఆయన చాణక్యం వల్లే హైదరాబాద్‌కు విముక్తి లభించిందని గుర్తు చేశారు. ఐక్యతా విగ్రహంతో సర్దార్ పటేల్‌ను సత్కరించుకున్నామన్నారు. వసంత పంచమి వేళ రామానుజ విగ్రహావిష్కరణ సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు.
రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయన్నారు. మన సంస్కృతిలో గురువే జ్ఞానానికి కేంద్రమన్న మోడీ.. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని ఆయన చెప్పారు. రామానుజాచార్యుల ప్రతిభ, వైరాగ్యం ఆదర్శాలకు ప్రతీక అని వెల్లడించారు. రామానుజాచార్యులు ముందు తరాలకు ప్రేరణగా నిలిచారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శ్రీరామనగరంలో 108 దివ్య దేశ మందిరాల ఏర్పాటు అద్భుతమన్న ప్రధాని.. దేశమంతా తిరిగి ఆలయాలు చూసిన అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.
చినజీయర్ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారని.. ఆ యజ్ఞఫలం 130 కోట్ల ప్రజలకు అందాలని మోదీ కోరుకున్నారు. మనదేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయన్న మోడీ.. రామానుజాచార్యుల విశిష్టాద్వైతం మనకు ప్రేరణ అని తెలిపారు. సమతామూర్తి బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు. అంధవిశ్వాసాలను రామానుజాచార్యులు పారదోలారన్న ప్రధాని.. భక్తికి కులం, జాతి లేదని చాటిచెప్పారని గుర్తుచేశారు. మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటి చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులని తెలిపారు. ఆ సమతామూర్తి దళితులను ఆలయ ప్రవేశం చేయించారని ప్రధాని చెప్పారు.
తెలంగాణ గొప్ప పర్యాటక ప్రాంతంగా ఎదుగుతోందని ప్రధాని ప్రశంసించారు. రామప్ప ఆలయానికి ఇప్పటికే యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామపురస్కారం లభించిందని ప్రధాని వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచఖ్యాతి గడిస్తోందని ప్రధాని తెలిపారు. ప్రపంచ పర్యాటక తలమానికంగా సమతా విగ్రహం వెలుగొందుతుందని చెప్పారు.