అతనొక రాష్ట్రానికి క్రీడల మంత్రి. ఐతే ఇంకో పది రోజుల్లో జరిగే ఐపీఎల్ వేలంలో అతడి పేరు వినిపించబోతోంది. రూ.50 లక్షల కనీస ధరతో అతను వేలంలోకి రాబోతున్నాడు. మరి మంత్రి గారిని ఏ జట్టయినా సొంతం చేసుకుంటుందేమో.. ఐపీఎల్లో ఆడబోతున్న తొలి మంత్రిగా అతను రికార్డు సృష్టిస్తాడేమో చూడాలి. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటారా? పశ్చిమ బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారి.
భారత జట్టు తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడిన మనోజ్.. క్రికెట్లో కొనసాగుతూనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. 36 ఏళ్ల మనోజ్‌ను వెంటనే మమత మంత్రిని చేసేసింది. తన క్రికెట్ నేపథ్యానికి తగ్గట్లే క్రీడా మంత్రిత్వ శాఖను అప్పగించింది. పది నెలల నుంచి ఆ శాఖ బాధ్యతలు చూస్తున్నాడు మనోజ్.
ఐతే మంత్రిగా ఉంటూనే వీలు చిక్కినపుడు అతను క్రికెట్ ఆడుతున్నాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఐపీఎల్ ఆడేందుకు రెడీ అయిపోయాడు. గతంలో కోల్‌కతా, పుణె, ఢిల్లీ, పంజాబ్ తరఫున ఐపీఎల్లో చాలా మ్యాచ్‌లే ఆడాడు మనోజ్. ఐతే కొన్నేళ్ల కిందట్నుంచి అతడికి ఐపీఎల్లో ఏ జట్టూ అవకాశం ఇవ్వట్లేదు.
వేలంలో కూడా అతణ్ని ఎవరూ కొనట్లేదు. అలాగని అతను ఐపీఎల్ కెరీర్ మీద ఆశలు వదులుకోలేదు. రాష్ట్ర మంత్రిగా ఉంటూ ఇంకా ఐపీఎల్లో ఆడటమేంటి అనుకోకుండా.. ఈసారి జరగబోయే మెగా వేలానికి తన పేరును నమోదు చేసుకున్నాడు. రూ.50 లక్షల కనీస ధరతో అతను వేలంలోకి రాబోతున్నాడు. మరి మంత్రిగారికి ఏ జట్టయినా అవకాశం ఇస్తుందేమో చూడాలి. మంత్రిని జట్టులో పెట్టుకుంటే వచ్చే పబ్లిసిటీ కోసమైనా ఏదో ఒక జట్టు అతణ్ని ఎంచుకునే అవకాశం లేకపోలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates