పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ మధ్య వివాదం రోడ్డున పడింది. మమతకు, ధన్కర్కు తొలి నుంచి పడటం లేదు. ఇద్దరూ తరచూ బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటారు. మమతను ఓడించాలని.. గత ఎన్నికల సమయంలో వ్యాఖ్యలు చేసిన గవర్నర్ను రాష్ట్రం నుంచి తరిమికొడతామని మమత అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ఇలా .. ఒకరిపై ఒకరు కేంద్రం పెట్టిన మంటతో భోగి మంటలా రగిలిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్లో ఆమె ధనకర్ను బ్లాక్ చేశారు.
గవర్నర్ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ చేసే ట్వీట్ల వల్ల మనస్తాపం చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీని గవర్నర్ బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ధన్కర్ను బెంగాల్ గవర్నర్గా తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని మమత నిప్పులు చెరిగారు. చర్యలు తీసుకునే సూచనలే కన్పించడం లేదన్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయించినట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.
“ఆయన (గవర్నర్) ఎవరినీ లెక్క చేయడం లేదు. అందరినీ బెదిరిస్తున్నాడు“ అని పేర్కొన్న మమత.. ఆయనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పలుమార్లు లేఖలు రాసినట్టు చెప్పారు. తాను స్వయంగా వెళ్లి కూడా మాట్లాడానని పేర్కొన్నారు. గవర్నర్ తీరుతో గత ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పంపిన ప్రతి ఫైలు పెండింగులో పెడుతున్నారని, విధాన నిర్ణయాలపై ఆయనెలా మాట్లాడతారని మండిపడ్డారు. ఇదే విషయమై ప్రధాని మోదీకి నాలుగు ఉత్తరాలు కూడా రాసినట్టు తెలిపారు.
అలాగే, గవర్నర్ ధన్ఖర్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మమత ఆరోపించారు. పెగాసస్ స్పై వేర్ను ఉపయోగించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందని బీజేపీ పశ్చిమ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ ఆరోపించిన 24 గంటలలోపే మమత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో గవర్నర్కు, ముఖ్యమంత్రికి మధ్య వివాదాలు రోడ్డున పడ్డాయని.. ఇదిరాష్ట్ర అభివృద్దిపై ప్రభావం చూపుతుందని.. పరిశీలకులు చెబుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా ఉన్న మమతను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా.. కేంద్రం ఉందని.. ఈ పరిణామం వారికి నచ్చుతుందని.. అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates