తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలంతా మౌనం వ్రతం వహిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఒకవైపు అధ్యక్షుడు రేవంత్ తీవ్రంగా శ్రమిస్తుంటే ఆ నేతలు మాత్రం తమకు సంబంధం లేని పనిగా సైలెంట్ అయ్యారు. మరోవైపు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం రోజు రోజుకు వెనకడుగు వేస్తోంది. పార్టీకి కొత్త అధ్యక్షుడు మారినా పరిస్థితి మారకపోవడంతో శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దేశంలోనే తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణను ఎంపిక చేసింది. జనవరి 26 కల్లా 30 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్ విధించింది. కానీ ఆ తేదీ పూర్తయినా అందులో సగం సభ్యత్వాలు కూడా పూర్తి కాలేదు. దీంతో సభ్యత్వ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది అధిష్ఠానం.
ఈ స్వల్ప వ్యవధిలో 30 లక్షల పూర్తి స్థాయి టార్గెట్ ను ఛేదించడం కష్టమే. దీనికి ప్రధాన కారణం సీనియర్ నేతల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ అంటే కేవలం రేవంతే అన్నట్లుగా మారిందని.. కేవలం ద్వితీయ శ్రేణి నేతలతోనే రేవంత్ బండి నడిపిస్తున్నారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రేవంత్ ఆధిపత్యం నచ్చక కొందరు.. రేవంత్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని మరికొందరు పార్టీకి దూరంగా ఉంటున్నారట. ఈ నెలతో అధిష్ఠానం విధించిన గడువు కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత రేవంత్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు.
రేవంత్ అందుబాటులో లేకుంటే పార్టీ ఇతర కార్యవర్గం అంతా ఏం చేస్తుందో అర్థంకావడం లేదని పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. గత ఏడాది జూన్ లో పీసీసీ అధ్యక్ష పదవితో పాటు మరికొన్ని పదవులు భర్తీ చేసింది అధిష్ఠానం. ఇందులో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. గీతా రెడ్డి, అంజన్ కుమార్, అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేశ్ గౌడ్ ఉన్నారు. సీనియర్ ఉపాధ్యక్షులుగా పది మంది నియమితులయ్యారు. ఇందులో.. సంభాని చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, వేం నరేందర్, పొదెం వీరయ్య, సురేష్ షెట్కార్, రమేశ్, జి నిరంజన్, కుమార్ రావు, జావీద్ అమీర్ ఉన్నారు.
ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కీ, కన్వీనర్ గా అజ్మతుల్లా ఉన్నారు. ఎలక్షన్ మేనేజింగ్ కమిటీ చైర్మన్ గా దామోదర రాజనర్సింహ కొనసాగుతున్నారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇంత మంది పార్టీ కార్యవర్గం ఉంటే కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారట. మిగతా వారు పెద్దగా రెస్పాండ్ కావడం లేదట. అధిష్ఠానం ఇప్పటికైనా చొరవ తీసుకొని.. రేవంత్ తో అందరూ సమన్వయం చేసుకొని పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయించాలని కార్యకర్తలు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!