కొన్ని దశాబ్దాలుగా దేశంలో నలుగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై తాము ఏమీ చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ రిజర్వేషన్ల కేటాయింపునకు కొలమానా లు తేల్చడంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఆయా రాష్ట్రాలే పరిష్కారం దిశగా సరైన చర్యలు చేపట్టాల ని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్వర్రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది.
చివరగా గతేడాది అక్టోబర్ 26న విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. తీర్పును వాయిదా వేసింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరిన కేంద్ర ప్రభుత్వం.. ఆయా రాష్ట్రాలు అనుసరించే విధంగా కచ్చితమైన, నిర్దిష్టమైన ఒక విధానం తీసుకురావాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలు ప్రధాన స్రవంతి నుంచి దూరంగా ఉన్నారని, వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు.
అంతకుముందు.. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీ, ఎస్టీలను ప్రతిభలో ఉన్నత వర్గాలతో సమాన స్థాయికి తీసుకురాలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇది వాస్తవమని, దీనికి పరిష్కారంగా సుప్రీంకోర్టే తగిన ప్రతిపాదనలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని వివరించింది. అయితే.. దీనిపై సుదీర్ఘ కాలం వాదనలు సాగాయి. అయితే.. దీనిపై తమకు ఆశించిన విధంగా సుప్రీం కోర్టు తీర్పు వస్తుందని.. ఆయా వర్గాలు ఎదురు చూశాయి. అయితే.. సుప్రీం కోర్టు ఈ విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది.
దీంతో ఇప్పుడు.. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఆయా రాష్ట్రాలే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. రాజకీయ అస్త్రంగా మారుతుందనే వాదన వినిపిస్తోంది. తాజా సుప్రీంకోర్టు తీర్పుతో.. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు.. తాము అధికారంలోకి వస్తే.. ఎస్టీ, ఎస్టీలకు ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పిస్తామనే హామీ ఇచ్చే అవకాశం ఉందని.. రిశీలకులు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ.. సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం చూపుతుందా? లేదా? రాజకీయ పక్షాలు దీనిని ఎలా చూస్తాయి.. అనే విషయాలు ఆసక్తిగా మారాయి.