సీఎం జగన్ పక్కన మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్

దేశంలోనే అత్యున్నత సర్వీసులుగా చెప్పే సివిల్స్ కు ఎంపికైన వారి తీరు మిగిలిన వారికి కాస్తంత భిన్నంగా ఉండేది. సీనియర్.. జూనియర్ అన్న విషయాన్ని పక్కన పెడితే ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు తమ ఉద్యోగాలకు మాత్రమే తప్పించి అధికారానికి లొంగరన్న పేరుండేది.

కానీ.. గడిపిన ఇరవై ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అలా చెప్పే పరిస్థితి కనిపించటం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఈ సర్వీసులో ఉన్న వారి తీరు తరచూ వివాదాస్పదం కావటమే కాదు.. కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఇలాంటి సీన్ ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని ఇందిరాగాంధీ మన్సిపల్ మైదానంలోనిర్వహించిన రిపబ్లిక్ వేడుకల్లో కనిపించిన ఒక సీన్ పలువురిని విస్మయానికి గురి చేసింది. ఈ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో కూర్చున్నారు. మిగిలిన ఐఏఎస్ అధికారులు సీఎం జగన్ వెనుక వరుసలో కూర్చున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏదో అవసరం పడటం.. తన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను పిలిచారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతో కావొచ్చు.. మోకాలి మీద కూర్చొని ఆయనతో మాట్లాడిన వైనం చూసిన వారంతా నోరెళ్ల పెడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారి విషయంలో మర్యాదనుప్రదర్శించటం తప్పేం కాదు. మరీ..ఇంతలా మోకాలి మీద కూర్చొని మరీ విధులు నిర్వర్తించాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.

ముఖ్యమంత్రి పట్ల స్వామి భక్తి ప్రదర్శించటానికి ఇలాంటి తీరు సరికాదని.. ఐఏఎస్ అధికారిగా కాస్తంత హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితిని ఆశించటం అత్యాశే అవుతుందేమో?