గుడివాడ క్యాసినో.. కొత్త‌కాదు: RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గుడివాడలో జ‌రిగిన‌ట్టు టీడీపీ ఆరోపిస్తున్న‌ క్యాసినోపై స్పందించారు. త‌న‌దైన శైలిలో ఆయ‌న ట్వీట్ చేశారు. క్యాసినో వ్య‌వ‌హారం గుడ‌వాడ‌కు కొత్త‌కాద‌ని చెప్పిన వ‌ర్మ‌.. దీనిపై మంత్రి నాని క‌న్నా ముందుగా దివంగ‌త ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి.. అంటూ తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.

గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్స్ రేట్ల విషయంలో, ఆ తర్వాత సంక్రాంతి పండుగ సమయంలో జరిగిన వ్యవహారం మీద వ‌ర్మ తీవ్ర‌ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుడివాడ క్యాసినోపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. అందులో ‘కొడాలి నాని కంటే ముందు గుడివాడ క్యాసినో లైఫ్ గురించి నేను గ్రేట్ జయ మాలిని ద్వారా విన్నాను.

అలాగే, సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా తన సినిమాలో ఆ పాటను అనుమతించా రు. అందుకే, క్యాసినోపై కొడాలి నానిని ప్రశ్నించే ముందు టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి’ అంటూ పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ట్వీట్‌కు ‘యమగోల’ సినిమాలోని ‘గుడివాడ వెళ్లాను’ అనే వీడియో సాంగ్‌ను జత చేయడం ఆసక్తికరమైన విషయం.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా, ఇంతకముందు టికెట్ రేట్ల విషయంలో ఏపీ మంత్రి పేర్ని నానితో వర్మ చర్చచలు జరిపిన సంగతి తెలిసిందే. కానీ, దీని వల్ల ఎలాంటి పరిష్కారం లభించలేదు. వర్మ మాత్రం ఈ మధ్య వరుస ట్వీట్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. మ‌రి వ‌ర్మ ట్వీట్‌పై టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో…  లేక‌.. మ‌న‌కెందుకులే అనుకుంటారో.. చూడాలి.