రాజకీయాల్లో నాయకులు చేసే శపథాలు ఎన్నాళ్లు ఉంటాయి? అప్పటి పరిస్థితులను బట్టి..చేసే శపథాలే. అంటే ఒకరకంగా.. పిల్లి శపథాలే! దీంతో నాయకులు తాము చేసిన శపథాలపై నిలబడే నాయకులు పెద్దగా ఉండరు. అందుకే నాయకులు చేసే శపథాలకు పెద్దగా వాల్యూ కూడా ఉండదు. అయితే.. ఒకరిద్దరు మాత్రం శపథం కోసం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వీరిలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒకరు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
ఈ క్రమంలో ఇక క్రియాశీల రాజకీయాలకు రాను అని చెప్పారు. అప్పటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాల్లో దూరంగా ఉంటున్నారు. కేవలం రాజకీయ విశ్లేషణలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇదే కోవలో విజయవాడ మాజీ ఎంపీ, పైర్ బ్రాండ్ నాయకుడు లగడపాటి రాజగోపాల్ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే.. ఆయన క్రియాశీల రాజకీయాల్లో పోటీ చేయనని చెప్పలేదు.
కేవలం ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలకు మాత్రమే దూరంగా ఉన్నారు. ఉంటానని చెప్పారు కాబట్టి ఆయన అలా ఉంటారని అనుకున్నారు. అయితే..ఇప్పుడు ఆయనకు టీడీపీ ఆహ్వానం పలుకుతోందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే.. తాము సీటు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని.. టీడీపీ చెబుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అది కూడా ఆయనకు విజయవాడ ఎంపీ సీటును ఆఫర్ చేస్తామని చెబుతున్నారని తెలిసింది.
అయితే.. లగడపాటి రాజగోపాల్ తిరిగి రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనేదే ఆసక్తి. వాస్తవానికి ఆయన ఇప్పుడు వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. కానీ, రాజకీయంగా చూసుకుంటే.. లగడపాటి వంటిఫైర్ బ్రాండ్ నేత లోటు కనిపిస్తోంది. ఆయన రావాలని.. అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారనేది టీడీపీ మాట. ఈ క్రమంలోనే ఆయనను తీసుకునేందుకు పార్టీ ఉత్సాహంగా ఉంది. ఆయన వస్తే.. విజయవాడ ఎంపీ సీటును ఆయనకు ఇచ్చి.. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నానిని గుంటూరుకు పంపించే యోచనలో ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఇక, గుంటూరుఎంపీ గల్లా జయదేవ్‌ను చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పంపాలని నిర్ణయించుకున్నారని తమ్ముళ్లు చెబుతున్నారు. మరి లగడపాటి వస్తారో.. లేదో చూడాలి.