ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇస్తోంది ఏపీ సర్కారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ప్రకటించిన ఐఆర్ తో గుర్రుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు..హెచ్ఆర్ఏ మీద ఆశ పెట్టుకున్నారు. ఆ విషయంలోనూ వారికి నిరాశ తప్పలేదు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన ఐఆర్ షాక్ నుంచి కోలుకోని ప్రభుత్వ ఉద్యోగులకు.. తాజాగా హెచ్ఆర్ఏ షాక్ తో దిమ్మ తిరిగేలా చేసింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కొత్త వేతన సవరణ ఉత్తర్వులను వరుసగా వెలువరించింది.
ప్రధానంగా హెచ్ఆర్ఏ విషయంలో జగన్ సర్కారు అనుసరించిన విధానంతో పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నిజానికి హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం అనురిస్తుందన్న విధానంపై ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాలు ఆందోళనలో ఉన్నాయి. ఎప్పుడైతే అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సుల్ని పరిగణలోకి తీసుకోకుండా సీఎస్ కమిటీ సూచనను లెక్కలోకి తీసుకుంటారన్న అనుమానం ఉద్యోగులకు వచ్చింది. అదే జరిగితే తమకు భారీ నష్టం జరుగుతుందన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. ఇందుకు తగ్గట్లే తాజా ఉత్తర్వులు ఉండటంతో ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాల నేతలు హతాశులయ్యారు.
ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వల్ల వేతనాలు పెరగకపోవటం.. ఒకవేళ పెరిగినా రూ.వెయ్యి నుంచి రూ.1500 మాత్రమే పెరిగే పరిస్థితి. ఇలాంటి వేళ.. ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన డీఏలు ఇవ్వటం వల్ల కొంత మొత్తంలో వేతనం పెరుగుతుందని భావించారు. అయితే.. హెచ్ఆర్ఏలో కోత పెట్టటం వల్ల భారీ ఎత్తున ఆర్థిక నష్టమని చెబుతున్నారు. ఉదాహరణఖు ఒక ఉద్యోగికి రూ.13వేలు వచ్చే హెచ్ఆర్ఏ.. తాజాగా ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం చూస్తే.. రూ.8 వేలకు పడిపోతుందని.. అంటే నెలకు రూ.5వేల చొప్పున నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.
అంతేకాదు.. ఇక నుంచి పదేళ్లకు ఒకసారి వేతన సవరణను అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పింఛన్ దారులకు అదనపు మొత్తం పింఛన్ చెల్లించే వయసునూ ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులను ఇవ్వటంతో.. ఇకపై రిటైర్ అయిన ఉద్యోగులకు 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వారికి అదనపు పింఛను లభించనుంది. అంతేకాదు.. రాష్ట్ర పీఆర్సీకి మంగళం పాడిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ తరహాలోనే కొత్త పీఆర్సీ అమలు చేయనున్నారు. మొత్తంగా ఆశ పెట్టుకున్న ఐఆర్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోక ముందే.. హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి మరో షాకిచ్చిందని చెబుతున్నారు.