కరోనా వైరస్ తీవ్రత ఈసారి చాలామంది ప్రముఖులను ఇబ్బంది పెడుతోంది. తాజాగా చంద్రబాబునాయుడుకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా చెప్పారు. తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పారు. రెండు రోజుల క్రితం నారా లోకేష్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు మంత్రి కొడాలినానికి, సీనియర్ నేత వంగవీటి రాధాకు కూడా వైరస్ సోకిన విషయం తెలిసిందే.
వీళ్ళు కాకుండా మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలకు కూడా కరోనా సోకుతోంది. రెగ్యులర్ గా జనాల్లో తిరుగుతున్న కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనాబారిన పడక తప్పటంలేదు. వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబుకు మూడోసారి కరోనా సోకటం గమనార్హం. వీళ్ళేకాదు సినిమా ప్రముఖులు మహేష్ బాబు, కమలహాసన్ లాంటి వాళ్ళు కూడా చాలామంది ఇపుడు కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళంతా హోం క్వారంటైన్లోనే ఉంటున్నారు.
పొద్దున లేచినదగ్గర నుండి రాత్రి పడుకునేంతవరకు జనాల్లో ఉంటున్నారు చాలామంది ప్రముఖులు. దాంతో తమదగ్గరకు వచ్చే వాళ్ళల్లో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో కూడా తెలీదు. వచ్చిన ప్రతిఒక్కరినీ ఆపి కరోనా ఉందా లేదా అడిగటమూ సాధ్యంకాదు. ఇంతకముందు కేసీయార్, కేటీయార్, హరీష్ రావుతో పాటు చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలకు కూడా కరోనా సోకింది. తాజాగా తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కరోనాతో ఆసుపత్రిలో చేరారు.
చంద్రబాబు అయినా, పోచారం అయినా ఎవరైనా కానీండి వాళ్ళు పెట్టుకుంటున్న మాస్కులు ఏమాత్రం సరిపోవు. భౌతికదూరం పాటించటం మనదేశంలో సాధ్యంకాదు. కాబట్టి ముందు జాగ్రత్తగా చేయాల్సిందేమంటే అవసరమైతే తప్ప ఇంట్లోనుండి బయటకు రాకూడదు. కానీ రాజకీయ నేతలకు అది సాధ్యంకాదు. జనాల్లో ఉంటే ఒకసమస్య, జనాలకు దూరంగా ఉంటే మరో సమస్య. కాబట్టి కరోనావైరస్ తో సహజీవనం చేయటానికి మానసికంగా సిద్ధమైపోతున్నారు.