ఎంపీ రఘురామ హత్యకు కుట్ర జరిగిందా ?

తనను హత్య చేయించేందుకు ఏపీలో కుట్ర జరిగిందని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వంపైన, జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణల్లో తాజాగా చేసిన తన హత్య కుట్ర అనే ఆరోపణలు చాలా కీలకమైనవి. హత్యకు ఎవరు కుట్ర చేశారంటే ఏపీసీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చేశారట. జగన్ తో పాటు సునీల్ నుండి తనకు ప్రాణహాని ఉందంటు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకే ఎంపీ లేఖ రాశారు.

తన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ)ని రంగంలోకి దింపాలని కూడా లేఖలో సూచించారు. నరసాపురం పర్యటనలో ఉన్నపుడే తనను చంపటానికి కుట్ర చేసినట్లు ఎంపీ చెబుతున్నారు.  

తనను హత్య చేయటానికి ఝార్ఖండ్ నుండి మనుషులను తెప్పించారట. సునీల్ కు చెందిన అంబేద్కర్ ఇండియా మిషన్ అనే సంస్ధలోని మునుషుల ద్వారా తనను చంపించేందుకు ప్లాన్ చేశారని రాజు ఆరోపిస్తున్నారు. కేసుల దర్యాప్తులో భాగంగా తాను పోలీసుస్టేషన్ కు వచ్చినపుడు అక్కడే తనను హత్య చేయించేందుకు సునీల్ ప్లాన్ చేసినట్లు తనకు సమాచారం ఉందంటున్నారు. ఈ కుట్రలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భాగస్తుడేనట.

ఆ మధ్య విజయవాడలో వంగవీటి రాధా కూడా తనను చంపటానికి రెక్కీ నిర్వహించారంటు ఆరోపించిన విషయం తెలిసిందే. రెక్కీ నిర్వహించారని చెప్పిన రాధా అందుకు ఆధారాలను మాత్రం చూపలేకపోయారు. రాధా ఇంటిముందు, రోడ్డులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన రెండు నెలల ఫుటేజీలను పరిశీలించినా రెక్కీ విషయం బయట పడలేదు.