నోటీసులతో మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోయిన రఘురామ

తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈసారి సంక్రాంతి పండక్కి.. తాను ప్రాతినిధ్యం వహించే నరసాపురానికి వెళ్లనున్నట్లుగా ఆయన ప్రకటన చేయటం తెలిసిందే. సొంత పార్టీ మీద అదే పనిగా విరుచుకుపడే రఘురామ.. తన ఊరికి వెళితే.. పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. సంక్రాంతికి ఊరికి వెళ్లేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆయనకు.. ఏపీ సీఐడీ వారి పుణ్యమా అని ఊహించని షాక్ తగలటం తెలిసిందే.


బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వచ్చిన సీఐడీ అధికారులు.. ఆయనకు నోటీసులుఇచ్చారు. గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంటూ వెళ్లిపోయారు. అయితే.. ఏ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారన్న దానిపై మాత్రం సమాచారం ఇవ్వలేదు. రఘురామను అరెస్టు చేయొద్దని.. సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసే అవకాశం లేదు.

అయినప్పటికీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ రఘురామకు మళ్లీ సీఐడీ నోటీసులు ఎందుకు వచ్చింది? సుప్రీం ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. నోటీసులు ఎందుకు ఇచ్చారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించని పరిస్థితి. ఇటీవల తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రఘురామ చెప్పటం తెలిసిందే. సంక్రాంతికి సొంతూరికి వెళతానని ఆయన ప్రకటించి.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకుంటున్న వేళలో హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. బుధవారం ఏపీ సీఐడీ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న రఘురామ.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి వెల్లిపోయినట్లుగా చెబుతున్నారు. తాజాగా అందజేసిన నోటీసుల నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణ గురించి చర్చలు జరిపేందుకు.. న్యాయ నిపుణులతో మాట్లాడేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. మొత్తమ్మీదా తాజా నోటీసుల పుణ్యమా అని.. సంక్రాంతికి ఊరికి వెళ్లలేని పరిస్థితి రఘురామకు ఎదురైందని చెప్పక తప్పదు.