సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తి కాదని, పోలవరంపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?అని చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. తన రాజకీయ చరిత్రలో ఈ తరహా పాలన ఎప్పుడూ చూడలేదని, వైసీపీ పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. ఏపీ భవిష్యత్ కోసం ప్రజలంతా ఆలోచించాలని, ప్రస్తుత పాలన వల్ల రాష్ట్రంలో జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు.
రాష్ట్రంలో ప్రజావేదిక విధ్వంసంతో జగన్ తన పరిపాలనను ప్రారంభించారని, ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చివేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని కోసం 50 వేల ఎకరాలను రైతులు ఇచ్చారని, రాజధానిలో10 వేల కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. గత ప్రభుత్వాలు కూడా జగన్ మాదిరిగానే విధ్వంసం చేస్తే హైదరాబాద్ ఉండేదా? అని ప్రశ్నించారు. అమరావతే రాజధాని అని ప్రతిపక్షనేతగా అంగీకరించిన జగన్, సీఎం అయిన తర్వాత మాట తప్పారని దుయ్యబట్టారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తిని విధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజా చైతన్యం అవసరమని చంద్రబాబు అన్నారు.
అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే ఏపీకి భవిష్యత్తు అని చెప్పారు. పోలవరం పూర్తి చేయడం జగన్ కు చేతనవుతుందా అని ప్రశ్నించారు. దేశానికి అన్నపూర్ణగా అన్నం పెట్టిన ఆంధ్రప్రదేశ్ లోనే వరి వేయొద్దని చెబుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాల కంటే ముందే టీడీపీ ఎన్నో రత్నాలు ఇచ్చిందని అన్నారు.
ప్రజలు, మీడియా వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని, దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.
ఏపీకి ప్రాజెక్టులు తేవడం విధ్వంసం చేసినంత సులువు కాదని, 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేశామని, ఆ పెట్టుబడులు వస్తే 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అని ఇతర రాష్ట్రాలు అవమానించే పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకు వ్యాక్సిన్ ఉందని, జగన్ పాలనకు ఎలాంటి వ్యాక్సిన్ లేదని ఎద్దేవా చేశారు. జగన్కు తాను తప్ప ఎవరూ అక్కర్లేదని, చెల్లి లేదు.. తల్లి లేదు అని దుయ్యబట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates