ఏపీ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న హత్య కేసుపై బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన కీలక నేత .. ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వంపైనా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో తన పేరు ప్రచారం చేశారని.. కానీ కోర్టుల జోక్యంతో అసలు కథ బయటికి వచ్చిందన్నారు. ఈ కేసులో తర్వలోనే కీలక అరెస్ట్లు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్నవారు ఎక్కడ దాక్కున్నా.. ఎంతవారైనా.. ఎవరు అండగా ఉన్నా.. వారిని అరెస్టు చేయడం ఖాయమని అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో త్వరలోనే కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని.. ఆదినారాయణరెడ్డి అన్నారు. తానే హత్య చేయించానంటూ అప్పట్లో బురదజల్లిన వైసీపీ నేతలు… ఇప్పుడు కథ అడ్డం తిరిగే సరికి దిక్కుతోచని స్థితిలో చిక్కారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంస పాలన పోవాలంటే బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా సొంత చిన్నాన్న హత్య కేసును సైతం విచారించలేని జగన్ ప్రభుత్వం అవసరమా? అని వ్యాఖ్యానించారు.
“వివేకా హత్య ఘటనలో నా పేరు ప్రచారం చేశారు. వివేకా హత్య కేసులో అరెస్టుల సినిమా ఇంకా ఉంది. త్వరలోనే కీలక అరెస్ట్లు జరిగే అవకాశం ఉంది. అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారు. వాళ్లకు భూములు ఎక్కడ ఉంటే.. అక్కడ రాజధాని ఉండాలనేది వాళ్ల ఆలోచన. పద్మనాభస్వామి ఆదాయం కంటే జగన్ ఆదాయమే ఎక్కువ” అని ఆదినారాయణ రెడ్డి అన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నందునే రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని.. లేకపోతే.. ఈ ప్రభుత్వంపై తిరగబడే వారని ఆది నారాయణరెడ్డి కామెంట్లు చేశారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని దుయ్యబట్టారు. ప్రతి విషయంలోనూ.. ప్రతిపక్షాలను బూచిగా చూపిస్తున్నారని విరుచుకుపడ్డారు. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates